శ్రీమహా విష్ణువు .. వైకుంఠపురములో లక్ష్మీదేవితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకు ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపిస్తుంది. ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతుందని గ్రహించిన విష్ణుమూర్తి, ఒక్కసారిగా అక్కడి నుంచి కదులుతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి చీరకొంగు ఆయన చేతిలో ఉండిపోతుంది. ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా విష్ణుమూర్తి వడివడిగా వెళుతుంటాడు. తమని ధరించవలసిందిగా శంఖు చక్రాలు ముందుకు వచ్చినా ఆయన పట్టించుకోడు.

విష్ణుమూర్తి ఎక్కడికి బయల్దేరినా క్షణాల్లో సిద్ధమయ్యే గరుత్మంతుడు కూడా స్వామి ముందుకు వచ్చి ఆగుతాడు. గరుడవాహనం వైపు కూడా చూడకుండా స్వామి పరుగు పరుగున వెళుతూ ఉంటాడు. స్వామి చేతిలో తన చీర కొంగు ఉండటంతో ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పరుగులాంటి నడకతో ఆయనను అనుసరిస్తూ ఉంటుంది. ఆయన భక్తుడు ఎవరో ఆపదలో ఉండి ఉండవచ్చనీ .. అందువల్లనే ఆయన అంత తొందర పడుతున్నాడనే విషయం మాత్రం లక్ష్మీదేవికి అర్థమవుతుంది.

శంఖు చక్రాలు రెండూ కూడా ముఖ ముఖాలు చూసుకుంటాయి. ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళుతున్నా తమని ధరించే బయల్దేరే స్వామి, ఈ సారి మాత్రం తమవైపు చూడకుండా వెళ్లిపోతుండటం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండటం చూసిన శంఖు చక్రాలు, తాము కూడా స్వామి వెనుకనే బయల్దేరుతాయి. ఇక స్వామి తమ ధ్యాసలో లేడు అనే విషయాన్ని గరుత్మంతుడు గమనిస్తాడు. అందువల్లనే ఆయన తనని పట్టించుకోకుండా వెళుతున్నాడని భావించి ఆయన కూడా అనుసరిస్తాడు.

విష్ణుమూర్తి తన పట్టు వస్త్రాలను కూడా సరి చేసుకోకుండా .. శంఖు చక్రాలు లేకుండా కంగారుగా వెళుతుండం చూసిన ఇంద్రాది దేవతలంతా ఆశ్చర్యపోతారు. తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా వెళుతున్న స్వామిని ఆశ్చర్యంగా చూస్తారు. ఏం జరగబోతుందో అర్థంకాక వాళ్లంతా కూడా అయోమయానికి లోనవుతారు. “త్రికూట పర్వతం” సమీపంలోని సరస్సులో మొసలి కారణంగా ప్రమాదంలో ఉన్న ఏనుగును స్వామి చూస్తాడు. ఆయన ఆంతర్యం అర్థంకాగానే సుదర్శనుడు వచ్చి ఆయన చేతిని అలంకరిస్తాడు. అంతే .. సుదర్శన చక్రంతో శ్రీమహావిష్ణువు ఆ మొసలి శిరస్సును ఖండిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.