సరస్సులో చాలా కాలంగా నివాసం ఉంటున్న మొసలి, సుదర్శన చక్రం కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. ఆ మొసలి గంధర్వుడిగా నిజరూపాన్ని పొంది తన లోకానికి వెళ్లిపోతుంది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి వెనుక కూడా ఒక బలమైన కారణం కనిపిస్తుంది. “హూ హూ” అనే ఒక గంధర్వుడు మహా అందగాడు. ఎప్పుడు చూసినా ఆయన అప్సరసలతో కలిసి శృంగార విలాసాలలో తేలిపోతూ ఉంటాడు. అలా ఒకసారి ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు.

అదే సమయంలో “దేవళ మహర్షి” అక్కడికి వస్తాడు. నదికి ఆయన స్నానానికి రావడం ఈ గంధర్వుడు చూస్తాడు. ఆ మహర్షిని ఆటపట్టిస్తూ అప్సరసలకు వినోదాన్ని కలిగించాలనీ, అలా తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకుంటాడు. స్నానానికి వచ్చిన దేవళ మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆయన మాటలు .. ధోరణి చూసి ఆ అప్సరసలు ఆనందాన్ని పొందుతుంటారు. వాళ్లు అదేపనిగా నవ్వుతూ ఉండటంతో మరింతగా రెచ్చిపోతుంటాడు.

జరుగుతున్నదంతా చూస్తూ దేవళ మహర్షి తనపని తాను చేసుకుపోతుంటాడు. ఆయన మౌనం కూడా గంధర్వుడు మితిమీరడానికి కారణమవుతుంది. ఎన్నిరకాలుగా ఎద్దేవా చేసినా ఆ మహర్షి మౌనంగా ఉండటంతో, అప్సరసాలను మరింత నవ్వించాలనే అత్యుత్సాహానికిపోతాడు. నీటి అడుగు నుంచి వెళ్లి ఆ మహర్షి రెండు కాళ్లను పట్టుకుని లాగేస్తాడు. దాంతో ఆ మహర్షి నీళ్లలో పడిపోతాడు. గంధర్వుడు చేసిన పనికి ఆగ్రహించిన ఆయన, నీటి అడుగు నుంచి వచ్చి తన కాళ్లు పట్టుకుని లాగిన కారణంగా మొసలివై జన్మించమని శపిస్తాడు.

దేవళ మహర్షి శాపానికి గంధర్వుడు బిత్తరపోతాడు. అప్పటివరకూ ఆయన చుట్టూ చేరి వినోదం చూసిన అప్సరసలు అంతా కూడా భయపడిపోతారు. తొందరపాటు తనంతో తాను చేసిన పనికి తనని క్షమించమని ఆ గంధర్వుడు మహర్షిని కోరతాడు. అత్యుత్సాహంతో అవమానపరిచినందుకు పెద్ద మనసుతో మన్నించమని వేడుకుంటాడు. శాపాన్ని తాను తిరిగి తీసుకోలేననీ, శ్రీమహా విష్ణువు సుదర్శన చక్రం చేత మొసలి రూపం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు. అలా మొసలి రూపాన్ని పొందిన గంధర్వుడు, చివరికి అలాగే నిజరూపాన్ని ధరించి తన లోకానికి వెళ్లిపోతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.