కచుడి పట్ల దేవయాని ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయనను కలుసుకోవడానికీ .. మాట్లాడటానికి ఆమె ఆరాటపడుతూ ఉంటుంది. ఆయన ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఆయన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నిరంతరం కచుడి ఆలోచనలతోనే గడుపుతూ ఉంటుంది. కచుడి పట్ల ఆమె ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతుండటం శుక్రాచార్యుడు కూడా గమనిస్తాడు. అయితే కచుడు మనసులో ఆమె పట్ల మరో విధమైన ఆలోచన ఉండదు. ఆమె గురువుగారి కుమార్తె అనే అభిమానం మాత్రమే ఉంటుంది.
కచుడిని అంతం చేయాలని నిర్ణయించుకున్న రాక్షస శిష్యులు .. ఆయన ఒంటరిగా ఎక్కడికి వెళ్లినా రహస్యంగా అనుసరిస్తూ ఉంటారు. నిర్జన ప్రదేశాల్లో ఆయనను హతమారుస్తూ ఉంటారు. కచుడి జాడ తెలియడం లేదని దేవయాని ఆందోళన వ్యక్తం చేసినప్పుడల్లా, శుక్రాచార్యుడు జరిగింది తెలుసుకుని కచుడిని తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. దాంతో రాక్షస శిష్యులు ఆలోచనలో పడతారు. కచుడిని హతమార్చి .. గురువుగారి మంత్రబలానికి చిక్కని ప్రదేశానికి పంపించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లంతా కలిసి ఒక పథకం వేసుకుంటారు.
ఎప్పటిలానే కచుడు గురువుగారి పూజకి అవసరమైన పూలు .. పండ్లు .. దర్భలు తీసుకురావడానికిగాను అడవికి వెళతాడు. రాక్షస శిష్యులు ఆయనను రహస్యంగా అనుసరిస్తారు. వాళ్లు తన వెనుక వస్తున్నారనే విషయం తెలియక, తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు కచుడు. ఆయన అలా పూలు .. పండ్లు సేకరిస్తూ ఉండగానే, వెనక నుంచి వచ్చేసిన రాక్షసులు అతనిని హతమారుస్తారు. ఆ అడవిలోనే కచుడి దేహాన్ని బూడిద చేసి, దానిని శుక్రాచార్యుడు సేవించే సురపానంలో కలుపుతారు. ఆ సురాపానాన్ని శుక్రాచార్యుడు సేవిస్తాడు.
రాక్షస శిష్యులంతా కూడా కచుడు ఇక తిరిగిరావడం జరగదని భావిస్తారు. ఆ సంతోషంతోనే వాళ్లంతా ఉంటారు. ఎంతసేపటికీ కచుడు అడవి నుంచి తిరిగిరాకపోవడంతో, దేవయాని ఆందోళన చెందుతుంది. ఆయన ఏదైనా ప్రమాదం బారిన పడ్డాడేమోనని కంగారు పడుతుంది. అడవి మృగాల బారిన పడ్డాడా? అనే ఆలోచన రాగానే భయంతో ఆమె వణికి పోతుంది. త్తన తండ్రి దగ్గరికి వచ్చి .. కచుడు అడవి నుంచి తిరిగి రాలేదని చెబుతుంది. ఆయనకి ఏం జరిగిందో .. ఎక్కడ ఉన్నాడో తెలియక తనకి చాలా ఆత్రుతగా ఉందని అంటుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.