దాసీగా తన మందిరంలోకి అడుగుపెట్టిన శర్మిష్ఠను చూసి దేవయాని నవ్వుతుంది. లోకంలో చాలామంది తమ స్థానం గురించి గొప్పగా ఊహించుకుని మాట్లాడుతుంటారు. కానీ ఉత్తములు అవతలివారి స్థానాన్ని ఎరిగి మాట్లాడతారు. ఎవరి స్థానం ఏమిటో తెలియక మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని అంటుంది. దాసీలు ఏయే పనులు చేస్తారో ఆమెకు బాగానే తెలుసుగనుక, ఇకపై తన మనసెరిగి తనకి కావలసిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉండమని చెబుతుంది. తనకి కాస్త కోపం ఎక్కువనీ .. అందుకు కారణం కాకుండా చూసుకోమని అంటుంది.
యయాతితో ప్రకృతి సాక్షిగా దేవయాని వివాహం జరిగిందని తెలుసుకున్న శుక్రాచార్యుడు, తాను దగ్గరుండి వాళ్లిద్దరి వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేసేస్తాడు. శుక్రాచార్యుడి నుంచి వర్తమానం అందుకున్న యయాతి, తన పరివారంతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. ఆ ఇద్దరి వివాహాన్ని శుకరాచార్యుడు అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. యయాతి వంటి అందగాడిని భర్తగా పొందిన దేవయానిని చూసి శర్మిష్ఠ అసూయపడుతుంది. దేవయానికి ఇంతటి అదృష్టం పడుతుందని తాను ఊహించలేదని అనుకుంటుంది.
యయాతి .. దేవయానిని వెంటబెట్టుకుని తన నగరానికి బయల్దేరతాడు. వాళ్లతో పాటు దాసీగా శర్మిష్ఠ కూడా వెళ్లవలసి వస్తుంది. తన కూతురిని తాను ఎలా పెంచినది యయాతికి శుక్రాచార్యుడు వివరిస్తాడు. ఆమె కోసం తాను ఏం చేయడానికి వెనుకాడనని అంటాడు. దేవయానికి పట్టుదల చాలా ఎక్కువని చెబుతాడు. ఆమె మనసుకు కష్టం కలిగిస్తే ఆమె ఎంతమాత్రం సహించదని అంటాడు. అందువలన ఆమె విషయంలో కాస్త సున్నితంగా వ్యవహరించమని చెబుతాడు. ఆమె కన్నీళ్లు పెట్టనంతవరకూ తాను చాలా ప్రశాంతంగా ఉంటానని అంటాడు.
ఇక వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ కొన్ని కారణాల వలన దాసీగా దేవయాని దగ్గర ఉంటుందని శుక్రాచార్యుడు చెబుతాడు. అందువలన ఒక దాసీగా ఆమె కూడా వాళ్ల వెంట వస్తుందని అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోను శర్మిష్ఠ వైపు ఆకర్షణకు గురికాకూడదనీ, అదే జరిగితే తాను ఎంతమాత్రం సహించనని చెబుతాడు. తాను చెప్పిన విషయాలు మరిచిపోవద్దని పదే పదే చెబుతూ వీడ్కోలు పలుకుతాడు. అలా దేవయానిని తీసుకుని, శర్మిష్ఠతో పాటు మిగతా దాసీలను వెంటబెట్టుకుని యయాతి తన నగరానికి చేరుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.