యయాతి భార్యగా దేవయాని ఆయన అంతఃపురంలో అడుగుపెడుతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమానురాగాలతో వాళ్లు మునిగి తేలుతుంటారు. ఇద్దరూ కూడా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లకి అవసరమైన సేవలు చేస్తూ .. వాళ్ల ఆనందాలను స్వయంగా చూస్తూ ఉంటుంది శర్మిష్ఠ. అయితే ఆమెకి దేవయానిపై అసూయ కంటే, యయాతిపై ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అలాంటి మనోహరుడికి చేరువకావడంలోనే అసలైన ఆనందం ఉందని ఆమె భావిస్తుంది. శర్మిష్ఠ సౌందర్యం ఆశ్చర్య చకితుడిని చేస్తున్నప్పటికీ, శుక్రాచార్యుడి హెచ్చరిక గుర్తుకు వచ్చి యయాతి మౌనంగా ఉండిపోతాడు.
ఓ శుభముహూర్తాన దేవయాని ఇద్దరు మగ శిశువులకు జన్మనిస్తుంది. ఆ ఇద్దరికీ యదువు .. తుర్వసుడు అనే పేర్లు పెడతారు. ఒక రోజున యయాతి ఏకాంతంగా ఉన్న సమయంలో శర్మిష్ఠ అటుగా వస్తుంది. శర్మిష్ఠకు తనపై మనసు ఉందని చాలా కాలం క్రితమే గమనించిన ఆయన, ఆమె పట్ల తనకి గల కోరికను వ్యక్తం చేస్తాడు. ప్రేమాభిమానాలతో ఆమెను అక్కున చేర్చుకుంటాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య సంబంధం రహస్యంగా సాగుతూ ఉంటుంది. యయాతి వలన ఆమె అనువు .. పూరువు .. ద్రుహ్యుడు అనే మగశిశువులకు జన్మనిస్తుంది.
ఒక వైపున భర్తపట్ల ప్రేమ .. మరో వైపున పిల్లల పట్ల అనురాగంతో దేవయానికి తెలియకుండానే రోజులు గడిచిపోతుంటాయి. ఆమె పట్టించుకోకపోవడంతో యయాతి – శర్మిష్ఠ మధ్య సాన్నిహిత్యం మరింత బలపడుతూ వస్తుంది. తన ద్వారా శర్మిష్ఠకి కలిగిన పిల్లలను కూడా యయాతి ఎంతో గారం చేస్తూ ఉంటాడు. అయితే ఆ విషయం ఎలాంటి పరిస్థితుల్లోను బయటపడకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటాడు. కానీ యయాతి – శర్మిష్ఠ మధ్య వ్యవహారం ముదురుతుండటంతో దేవయానికి అనుమానం మొదలవుతుంది.
శర్మిష్ఠకు సంతానం కలగడం .. ఆ పిల్లలు యయాతి పోలికలతో ఉండటంతో దేవయాని అనుమానం మరింత బలపడుతుంది. శర్మిష్ఠను దాసీగా చేసుకుని, తన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నానని తాను అనుకుంది. కానీ ఇప్పుడు శర్మిష్ఠ తనకి సవతిగా మారింది. తన భర్త అందగాడని శర్మిష్ఠ కుళ్లుకోవాలని అనుకుంటే, అతని ద్వారానే ఆమె సంతానం కూడా పొందింది. ఒక రకంగా శర్మిష్ఠనే తెలివిగా తనపై పగ తీర్చుకుంది. అందుకు కారణమైన యయాతిపై దేవయాని అలుగుతుంది. ఆ విషయంలో భర్త ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా, తండ్రి దగ్గరికి వెళ్లిపోతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.