Vadapalli – Sri Lakshmi Narasimha Swamy Temple

శివకేశవులు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలు చాలానే కనిపిస్తాయి. నదీ తీరంలోని శివకేశవ క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో “వాడపల్లి” ఒకటిగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో .. నల్గొండ జిల్లా .. దామచర్ల మండలం .. మిర్యాలగూడ సమీపంలో విలసిల్లుతోంది. ఇది ముచికుందా (మూసీ) .. కృష్ణానదీ సంగమ స్థానంలో వెలుగొందుతోంది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సంపదగా .. వందల సంవత్సరాల చరిత్ర నేపథ్యం కలిగినదిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.

ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి .. మీనాక్షి అగస్త్యేశ్వరుడు కొలువై భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటారు. 6 వేల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక వైపున లక్ష్మీ నరసింహస్వామినీ .. మరో వైపున శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. అందువల్లనే ఇక్కడి శివుడు మీనాక్షి అగస్త్యేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ తరువాత కాలంలో మరుగున పడిపోయిన ఈ మూర్తులు రెడ్డి రాజుల పాలన కాలంలో బయటపడ్డాయి. ఎక్కడ బయటపడిన మూర్తిని అక్కడనే ప్రతిష్ఠించి .. ఆలయాలు నిర్మించారు.

ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మూర్తి భారీగా దర్శనమిస్తుంది. స్వామివారి తొడపై అమ్మవారు కూర్చుని భక్తులను అనుకుగ్రహిస్తుంటుంది. గర్భాలయంలో స్వామివారికి నాసికకి ఎదురుగా ఒక దీపం .. ఆ పైన మరొక దీపం వ్రేలాడదీసి ఉంటాయి. స్వామివారు శ్వాసిస్తున్నట్టుగా ఆయన నాసికకి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పైనే ఉన్న మరో దీపం మాత్రం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అందువలన ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఇక్కడి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం వలన గ్రహసంబంధమైన పీడలు .. దుష్టశక్తుల వలన కలిగే బాధలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే మీనాక్షి అగస్త్యేశ్వరుడు దర్శనమిస్తాడు. శివలింగం తల భాగంలోని పది రంధ్రాలలో నుంచి అదే పనిగా నీరు ఊరుతూ ఉంటుంది. ఆ రంధ్రాలను దాటుకుని నీరు బయటికి రాదు. దానినే అర్చకులు .. భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు. శివలింగం తల భాగంలో పది రంధ్రాలు ఏర్పడం వెనుక ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం వాడపల్లి ఒక అడవి ప్రాంతంగా ఉండేది. అడవిలోని శివాలయం శిధిలమైంది. ఒక బోయవాడు ఒక పావురాన్ని పట్టుకోబోతే అది తప్పించుకుని వచ్చి శివలింగం వెనక దాక్కుంది. పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించిన బోయవాడు, ఆ పావురాన్ని పట్టుకోబోగా శివుడు ప్రత్యక్షమై అతనిని అడ్డుకున్నాడు. తనని శరణు వేడిన పావురాన్ని రక్షించవలసిన బాధ్యత తనకి ఉందని చెబుతాడు. అలా అయితే పావురం మందం మాంసం తనకి ఇస్తే దానిని వదిలేసి తాను వెళ్లిపోతానని ఆ బోయవాడు అంటాడు.

అయితే ఆలోచించకుండా తన తల మాంసం తీసుకోమని ఆ వేటగాడితో శివుడు అంటాడు. అప్పుడు ఆ బోయవాడు తన రెండు చేతుల వ్రేళ్లను స్వామి తలలోకి చొప్పించి మాంసాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. పరమ శివుడు బాధపడుతూ ఉంటే, ఆయనకి ఉపశమనం కలిగించడం కోసం పాతాళం నుంచి “గంగమ్మ” తన్నుకుంటూ వచ్చి పరమశివుడి తల భాగానికి చేరుకుందట. శివలింగం తల పైభాగంలోకి పది రంధ్రాలు ఆ బోయవాడి రెండు చేతుల వ్రేళ్ల గుర్తులు. ఆ రంధ్రాల్లో నిండి ఉన్నదే గంగ. తలభాగంలోని నీరును ఉద్ధరిణితో ఎంతగా తోడినా తరగదు. అర్చకులు ఆ నీటిని తమలపాకుతో చల్లినప్పుడు ఎంతో చల్ల గా అనిపిస్తాయి.

1524లో ఆదిశంకరులవారు తన శిష్యగణంతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శివలింగంలోని నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఆయనకి అర్థం కాలేదు. ఆ నీరు ఎంత లోతు నుంచి వస్తున్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఉద్ధరిణికి దారం కట్టి శివలింగం తలభాగంలోని ఒక రంధ్రం నుంచి లోపలికి వదిలారు. అలా ఎంత దారం వదులుతున్నా లోపలికి వెళుతూనే ఉండటం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఆయన ఆ దారాన్ని తిరిగి వెనక్కి లాగారు. అప్పుడు ఆ దారానికి అక్కడక్కడా రక్తం మరకలు ఉండటం చూసి ఆయన చాలా బాధపడ్డారు.

ఇక పై ఎవరూ ఇక్కడి భగవంతుడిని పరీక్షించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అక్కడే ఒక శిలా శాసనం వేయించారు. ఆ శాసనాన్ని మనం ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. హరిహరుల క్షేత్రం కావడం వలన అటు వైష్ణవ సంబంధమైన పర్వదినాలలోను .. ఇటు శైవ సంబంధమైన పర్వదినాలలోను భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కృష్ణ పుష్కరాల సమయంలో లక్షలాదిమంది భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. పుష్కర స్నానాలు ఆచరించి దర్శనం చేసుకొని ధన్యులవుతారు. కార్తీక మాసంలో విశేషమైన సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. మిర్యాలగూడ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి అదేపనిగా ఆటోలు తిరుగుతూనే ఉంటాయి.

*ఓం నమో భగవతే వాసుదేవయ .. ఓం నమః శివాయ

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Vadapalli – Sri Lakshmi Narasimha Swamy Temple

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store