Sarpavaram
ఒకానొక సమయంలో నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందినట్టుగా .. ఆయన సంతానమే ప్రభావ .. విభవ .. ప్రమోదూత అనే తెలుగు సంవత్సరాదులు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. అలా నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే “సర్పవరం”గా(Sarpavaram) స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా .. కాకినాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ మూలభావనారాయణ స్వామి .. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు.
పూర్వం నారదుడు .. విష్ణుమాయను తాను తప్ప ఎవరూ తెలుసుకోలేరు అనే అహంభావానికి లోనవుతాడు. దేవతల సభలో ఆ మాటను అనేస్తాడు కూడా. వెంటనే ఈ విషయం విష్ణుమూర్తి చెవికి చేరిపోతుంది. ఆ తరువాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు. ఆ కొలనులో మూడు మార్లు మునిగి పైకి లేవగానే ఆయన స్త్రీ రూపాన్ని పొందుతాడు. కొలను గట్టున పెట్టిన వీణ .. చిడతలు మాయమవుతాయి.
నారద స్త్రీ గతాన్ని మరిచిపోతుంది .. తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకి గుర్తుండదు. అప్పుడు పీఠికాపురం (పిఠాపురం)ను ఏలుతున్న నికుంఠ మహారాజు గుర్రంపై ఎదురవుతాడు. నారద స్త్రీ ఒంటరిగా సంచరించడం చూసి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆమెకి వెనకా ముందూ ఎవరూ లేరని గ్రహించిన ఆ రాజు, ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్లకి 60 మంది సంతానం కలుగుతారు. ఆ తరువాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానం అంతా కూడా శత్రు రాజుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు.
నారద స్త్రీ .. భర్త .. పిల్లల శవాల మధ్యలో ఒక చెట్టు క్రింద కూర్చుని రోదిస్తూ ఉంటుంది. అలా కన్నీరు ఇంకిపోయిన తరువాత ఆమెకి ఆకలి అవుతుంది. ఆ చెట్టుకి ఒక్కటే పండు ఉండటం చూసి దానిని అందుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, అంతకుముందు నారదుడు స్నానం చేసిన కొలను పక్కనే మరో కొలను సృష్టిస్తాడు. అందులో స్నానం చేసి వస్తేనే ఆ పండు ఆమెకి అందుతుందని చెబుతాడు. ఓ చెట్టుకొమ్మను పట్టుకుని నారద స్త్రీ మూడు మునకలు వేసి ఒడ్డుకు వస్తుంది. నారద స్త్రీ .. తిరిగి నారదుడిగా మారిపోతాడు. కానీ చెట్టుకొమ్మను పట్టుకున్న చేయి తడవని కారణంగా ఆ చేతికి గాజులు అంతే ఉంటాయి.
నారదుడు తన చేతికి గల గాజులను తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇదంతా విష్ణుమాయ అనే విషయం అర్థమైపోతుంది. అప్పుడు నారదుడు ఆ ప్రదేశానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటాడు. పూర్వం జనమేజయ మహారాజు “సర్పయాగం” తలపెడతాడు. దాంతో అనేక సర్పజాతులు వచ్చి అగ్నిలోపడి ఆహుతి అవుతుంటాయి. అప్పుడు “అనంతుడు” అనే సర్పరాజు .. పాతాళ లోకాన శ్రీమహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. పాతాళ మార్గాన్నే వచ్చి ఆయనకి శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు.
సర్పజాతి అంతరించకుండా కాపాడతానని అభయమిస్తాడు. భూలోకంలో నాగులు పూజలు అందుకునేలా చేస్తానని వరాన్ని ఇస్తాడు. సర్పజాతి వరాన్ని అందుకున్న ప్రదేశం కావడం వలన “సర్పవరం”(Sarpavaram) అనే పేరు వచ్చింది. అనంతుడి అభ్యర్థనమేరకు అక్కడే స్వామివారు గరుడ వాహనధారియై ఆవిర్భవిస్తాడు. అప్పటి నుంచి పాతాళ భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అక్కడ కూర్చుని సుదీర్ఘమైన తపస్సు చేసిన నారద మహర్షి స్త్రీ రూపం నుంచి తనకి పూర్తిగా విముక్తి కలిగేలా చేసుకుంటాడు.
తనకి స్త్రీ రూపం నుంచి విముక్తిని కలిగించిన కారణంగా, ఆ పక్కనే రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేస్తాడు. ఇలా ఇక్కడి ఆలయంలో పాతాళ భావనారాయణుడు .. రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణుడు భక్తులకు దర్శనమిస్తుంటారు. సువిశాలమైన ప్రదేశంలో .. పొడవైన ప్రాకారాలతో .. విశాలమైన మంటపాలతో నిర్మించబడిన ఈ ఆలయం కళ్లను కట్టిపడేస్తుంది. ఎంతోమంది రాజుల ఏలుబడిలో వైభవాన్ని చూసింది. పిఠాపురం రాజావారు ఈ ఆలయానికి ప్రధానమైన గోపురాన్ని నిర్మించారు.
నారదుడు ముందుగా స్నాన మాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు “నారద సరస్సు”గా .. స్త్రీ రూపం నుంచి ముక్తిని పొందిన సరస్సు “ముక్తికా సరస్సు”గా పిలవబడుతూ నేటికీ ఆలయానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇటు చారిత్రక ఘనత .. అటు ఆధ్యాత్మిక వైభవం కలిగిన ఈ క్షేత్రం దర్శనం చేతనే ధన్యులను చేస్తుంది. ప్రతియేటా మాఘ ఆదివారాలలో ఇక్కడ తీర్థం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కాకినాడకి అత్యంత సమీపంలో ఉండటం వలన అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలిక.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.