Burugadda
సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా ఒకే గర్భాలయంలో ఒకే ప్రధాన దైవం కొలువై ఉంటుంది. మిగతా దేవతా మూర్తులెవరైనా ఉంటే, ఉపాలయాలలో కొలువై దర్శనమిస్తూ ఉంటారు. వేణుగోపాలస్వామి .. లక్ష్మీ నరసింహ స్వామి .. ఆదివరాహస్వామి వేరువేరు ఆలయాలలో .. క్షేత్రాలలో వెలుగొందుతుండటం చూశాము. అలా కాకుండా ఆ ముగ్గురు అవతార మూర్తులు ఒకే గర్భాలయంలో .. ఒకే పీఠంపై కొలువైన క్షేత్రంగా “బూరుగు గడ్డ”(Burugadda) కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా .. హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.
పూర్వం “భృగు మహర్షి” తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన, ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల నుంచి హుజూర్ నగర్ వెళ్లే ప్రధానమైన రహదారి నుంచి కొంత దూరం లోపలికి వెళితే ఈ ఆలయం దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల చరిత్రకు అద్దం పడుతూ కనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు .. ప్రాకార మంటపాలతో .. సువిశాలమైన ప్రదేశంలో అలనాటి వైభవానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలిచినట్టుగా అనిపిస్తుంది. కాకతీయుల కాలంలో స్థానిక అధికారులైన సత్రం బొల్లమరాజు – దేవకీ పుత్రదాసు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది.
హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళితే ఎడమ వైపున “అనంత మంటపం” కనిపిస్తుంది. ఈ మంటపంలో 20 అడుగుల “అనంతపద్మనాభస్వామి” ఏకశిలా మూర్తి దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే గోదాదేవి .. మనవాళ్ల మహాముని సన్నిధి .. రామానుజుల వారి సన్నిధి .. ఆళ్వారుల మంటపం .. కనిపిస్తాయి. ముందుగా ప్రత్యేక మందిరంలో కొలువైన గోదాదేవి దర్శనం చేసుకున్న తరువాత ప్రదక్షిణ పూర్వకంగా వెళ్లి గర్భాలయంలోని ప్రధాన దైవాలను దర్శించడం ఇక్కడి ఆనవాయితీ.
గర్భాలయంలో ఒకే పీఠంపై ఒక వైపున వేణుగోపాల స్వామి .. మరో వైపున లక్ష్మీ నరసింహస్వామి .. మధ్యలో భూదేవి సమేత ఆదివరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. కృష్ణావతారం .. వరాహావతారం .. నరసింహావతారానికి సంబంధించిన మూర్తులను ఒకే వేదికపై చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడి దేవతా మూర్తులన్నీ తవ్వకాల్లో బయటపడినట్టుగా చెబుతుంటారు. ప్రతి విగ్రహంలోను అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టి పడుతుంటుంది. ముఖ్యంగా చెన్నగోపీనాథుడి విగ్రహం చూస్తే, “ర్యాలీ” జగన్మోహినీ కేశవస్వామి గుర్తుకువస్తాడు. అంతటి సౌందర్యంతో స్వామివారి మూర్తి తొణికిసలాడుతూ ఉంటుంది.
సాధారణంగా ఏ ఆలయంలోనైనా గోదాదేవి అమ్మవారి మూర్తి ఓ మాదిరి పరిమాణంలో ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి మూర్తి 6 అడుగుల వరకూ ఉంటుంది . ఇక ఆళ్వారుల ప్రతిమలు కూడా భారీ పరిమాణంలో కనిపిస్తాయి. నిజంగానే ఆళ్వారులు వచ్చి పంక్తి భోజనానికి కూర్చున్నారేమోనని అనుకునేలా ఉంటాయి. ఇక్కడి సూర్య పుష్కరిణి – చంద్రపుష్కరిణి ఆలయ ఘనతకు అద్దం పడుతుంటాయి. ధనుర్మాసంలోనే కాకుండా, వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు నేరేడుచర్ల మీదుగా .. అటు హుజూర్ నగర్ నుంచి ఈ ఆలయానికి ఆటోల్లో .. కార్లలో చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన గ్రహదోషాలు .. దుష్టశక్తి పీడలు .. భూ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.