భగవంతుడు భక్తుల కోరిక మేరకు .. మహర్షుల అభ్యర్థన మేరకు .. తన సంకల్పం కారణంగా కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాగే తన జాడను తెలియజేయడం .. నిత్య కైంకర్యాలు చేయించుకోవడం చేస్తుంటాడు. అలా స్వామివారు ఒక నవాబుకు స్వప్నంలో దర్శనమిచ్చి తన నిత్య పూజలకు అవసరమైన ఖర్చును ఆ నవాబు భరించేలా చేయడం ఒక క్షేత్రంలో జరిగింది. బాలాజీగా వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ఆ క్షేత్రం పేరే “బండపాలెం”. ఇది సూర్యపేట జిల్లా కోదాడకి అత్యంత సమీపంలో అలరారుతోంది.

ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశంలో అంతా బండపరచుకుని ఉంటుంది. పైకి కాస్త పలచగానే కనిపించినప్పటికీ, పైకి కనిపిస్తున్నది ఒక కొండ తల భాగంగా చెప్పుకోవచ్చు. ఈ బండను ఆనుకునే ఊరు .. పొలాలు ఉంటాయి. అందువల్లనే ఈ ఊరుకు బండపాలెం అనే పేరు వచ్చింది. విశాలంగా పరచుకున్న ఈ బండపైనే వేంకటేశ్వరస్వామి వెలిశాడు. స్వామివారు ఇక్కడ స్వయంగా వచ్చి వెలిసినట్టుగా గ్రామస్థులు చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి వారు చెబుతుంటారు.

చాలా కాలం క్రితం ఈ బండ చుట్టుపక్కల గల పొలాల్లో రైతులు పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక తెల్లని గుర్రంపై .. దివ్యమైన తేజస్సుతో కూడిన ఒక యువకుడు ఈ బండపైకి రావడాన్ని వారు చూశారు. ఎవరో ఏమిటో కనుక్కుందామని వారు బండ వైపుకు నడిచి వస్తుండగానే, ఆ తేజో మూర్తి గుర్రంపై మూడుమార్లు ప్రదక్షిణలు చేసినట్టుగా తిరిగి అదృశ్యమైపోయాడట. అది చూసి ఆశ్చర్యపోతూనే అక్కడికి చేరుకున్న రైతులకు, అక్కడి శిలపై వేంకటేశ్వరస్వామి వెలసి కనిపించాడట.

అప్పటి నుంచి భక్తులు అక్కడ పూజాభిషేకాలు జరిపించడం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. రాతి పలకలతోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాల కొరత ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే స్వామి నిజామ్ నవాబు కలలో కనిపించి, తాను ఫలానా ప్రదేశంలో బాలాజీగా అవతరించాననీ .. తన నిత్య పూజలకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సెలవిచ్చాడట. ఆ కలలో నిజం ఎంతో తెలుసుకోవడం కోసం నవాబు తన మనుషులను ఈ ప్రాంతానికి పంపించారు.

ఇక్కడ బాలాజీ స్వామి ఆవిర్భవించిన మాట నిజమేనని వారు నవాబుకు చెప్పడంతో, తనకి వచ్చింది సాధారణమైన కల కాదనే విషయం ఆయనకి అర్థమైంది. స్వామివారి నిత్య ధూపదీపాలకు అవసరమైన ఖర్చు తన వంశీకుల నుంచి కూడా ఎప్పటికీ అందుతూనే ఉంటుందని ఆయన ఒక అధికారిక పత్రం రాసిచ్చారట. దీనినే “ముంతగబ్బా” అంటారు. అప్పటి నుంచి నేటి వరకూ నవాబు వంశీకుల నుంచి స్వామి ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు అందుతూనే ఉండటం విశేషం.

గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తీరవలసిందే. మహా సౌందర్యమూర్తిగా ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పక్కనే గోదాదేవి అమ్మవారు “పెరియ పిరాట్టి”గా కొలువై ఉంటుంది. అయితే ఇక్కడ నీటి వసతి లేకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉండేవారు. లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తుండగా, ఆ బండపైనే కన్ను ఆకారంలో కోనేరు దానంతట అది ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నీటినే స్వామి కైంకార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. హోలీ పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం.

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.