ప్రాచీనకాలానికి చెందిన శైవ క్షేత్రాలకు వెళితే అక్కడ రాముడు పేరుగానీ .. పరశురాముడు పేరుగాని ఎక్కువగా వినిపిస్తుంది. రావణ సంహారం అనంతరం ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా రాముడు ప్రతిష్ఠించిన చాలా ఆలయాల్లోని శివుడిని రామలింగేశ్వరుడిగా పిలుస్తుంటారు. ఇక పరశురాముడు .. కార్తవీర్యార్జునుడిని సంహరించిన పాపం నుంచి బయటపడటానికి అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు. అలాంటి క్షేత్రాలలో “సిద్ధేశ్వర క్షేత్రం” ఒకటి.

పల్నాడు జిల్లా దుర్గి మండలం .. తేరాల గ్రామం సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్న “కామధేనువు”ను సొంతం చేసుకోవాలనుకున్న మాహిష్మతీ రాజ్యాధిపతి కార్తవీర్యార్జునుడు, అందుకు అడ్డుపడిన జమదగ్నిని హతమారుస్తాడు. భర్త నేలకూలడం చూసిన రేణుకాదేవి తమ కొడుకైన పరశురాముడిని పిలుస్తుంది. 21వ పిలుపుకి అక్కడికి చేరుకున్న పరశురాముడు, తన తండ్రి మరణానికి కారకులైన కార్తవీర్యార్జునుడినీ .. ఆయనతో పాటు క్షత్రియులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు.

అలా క్షత్రియులందరినీ అంతమొందించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు. అలా పరశురాముడు ప్రతిష్ఠించి పూజించిన క్షేత్రమే ఈ “సిద్దేశ్వర క్షేత్రం”. అయితే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ఫలానా చోట ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుని, పరశురాముడు అందుకు సంబంధించిన ప్రయత్నాలలో ఉండగా, ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు స్వయంభువుగా ఇక్కడ ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. శివలింగాన్ని తీసుకుని అక్కడికి వచ్చిన పరశురాముడు అంతకుముందే అక్కడ వెలసిన శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.

స్వయంభువు శివలింగానికి నమస్కరించుకుని, తాను తెచ్చిన శివలింగాన్ని ఆ వెనుకే ప్రతిష్ఠించాడు. అందువల్లనే ఇక్కడి గర్భాలయంలో రెండు శివ లింగాలు దర్శనమిస్తాయి. స్వయంభువు లింగాన్ని పుట్టుడు లింగమనీ, ఆ వెనుక ఉన్న లింగాన్ని పెట్టుడు లింగమని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. పరశురాముడి తరువాత ఎంతోమంది సిద్ధులు ఈ క్షేత్రంలో శివుడిని ఆరాధించి తాము కోరుకున్న సిద్ధులను పొందిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత కాలంలో ఆలయం నిర్మించబడింది.

స్వామివారితో పాటు ఈ క్షేత్రంలో భ్రమరాంబికదేవి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంది. ఇక్కడ “విభూది గుండం” పేరుతో కోనేరు కనిపిస్తుంది. పరశురాముడు నిర్మించిన ఈ కోనేరు రక్తవర్ణంలోకి మారడంతో, తాను చేసిన పాపం నుంచి ముక్తిని ప్రసాధించి, ఈ రుద్రగుండం .. విభూది గుండంగా మారేలా చూడమని పరశురాముడు కోరడంతో పరమశివుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ గుండంలో స్నానం ఆచరించిన తరువాతనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించి .. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.