ఆదిపరాశక్తి నుంచే త్రిమూర్తుల ఆవిర్భావం జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అలాంటి అమ్మవారు ఆవిర్భవించిన అష్టాదశ శక్తి పీఠాలలో “కోల్హాపురి” ఒకటిగా కనిపిస్తుంది. మహారాష్ట్ర లోని ఆత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడి అమ్మవారు “మహాలక్ష్మిదేవి” గా పూజాభిషేకాలు అందుకుంటోంది. “కోల్హాపూర్” జిల్లాలోని ఈ క్షేత్రం మహా మహిమాన్వితమైనదనే విషయం స్థలపురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారి అలంకరణ .. వైభవం చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి మూడవ “కన్ను” పడిందనేది స్థలపురాణం చెబుతుంది. ఇందుకు కారణమైన కథలోకి వెళితే, పూర్వం దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఒకరైన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకానొక సమయంలో తనని శివుడు అవమానించాడని భావించిన ఆయన, తాను కూడా శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగానికి అందరినీ ఆహ్వానించి కావాలనే శివుడిని పిలవడు. అయితే తండ్రి ఉద్దేశం తెలియని సతీదేవి, తన భర్త మాటను కాదని చెప్పేసి తండ్రి యాగం చేస్తున్న ప్రదేశానికి వెళుతుంది.
దక్ష ప్రజాపతి కావాలనే అందరి ముందు పరమశివుడిని నిందిస్తూ .. ఆయన భార్యగా సతీదేవిని కూడా అవమానపరుస్తాడు. భర్త వారించినా వినిపించుకోకుండా వచ్చినందుకు బాధపడుతూ యోగాగ్నిని సృష్టించుకుని ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది. దివ్యదృష్టితో చూసిన పరమశివుడు మహా ఉగ్రుడవుతాడు. వీరభద్రుడిని సృష్టించి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించమని ఆదేశిస్తాడు. ఆ మాటలను వీరభద్రుడు తూచ తప్పకుండా పాటిస్తాడు. సతీదేవి శరీరాన్ని తన భుజాన వేసుకుని శివుడు సంచరించడం మొదలుపెడతాడు. సదాశివుడు మళ్లీ “లయ”కి సంబంధించిన పనిలో నిమగ్నం కావాలంటే, ఆయన భుజాన ఉన్న సతీదేవి దేహాన్ని ఆయన నుంచి దూరం చేయాలని భావిస్తాడు.
ఆ ఉద్దేశంతో శ్రీమహావిష్ణువు వదిలిన సుదర్శన చక్రం సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేస్తుంది. ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు “శక్తి పీఠాలు”గా ఆవిర్భవించాయి. అలా “కొల్హాపురి”లో అమ్మవారి మూడవ కన్ను పడిందని చెబుతారు. గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం .. కమలం .. పండు .. నీళ్లకుండ కనిపిస్తాయి. ప్రళయ కాలంలో అమ్మవారు ఈ క్షేత్రం మునిగిపోకుండా తన కరములతో పైకి ఎత్తి పెయ్యికుందట. అందువలన దీనిని ‘కరవీర క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు.
దక్షిణ కాశీగా పిలవబడే ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన పురాణాలలో సైతం కనిపిస్తుంది. ఎంతోమంది రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం తన వైభవాన్ని చాటుతూ వచ్చింది. ఎంతోమంది భక్తులు ఇక్కడి అమ్మవారిని సేవించి తరించారు. ఛత్రపతి శివాజీ ఈ అమ్మవారిని ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించేవారట. ఆలయ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసినట్టుగా ఇక్కడ చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. కార్తీక మాసంలో .. శ్రావణ మాసంలో .. నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శన మాత్రం చేతనే దారిద్య్ర దుఃఖాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.