దేవయాని ఆవేశంగా తన తండ్రి దగ్గరికి వస్తుంది. తండ్రిని చూడగానే ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. యయాతి తనకి చేసిన అన్యాయం గురించి ఆమె తండ్రికి వివరిస్తుంది. తనతో ప్రేమగా ఉంటూనే ఆయన శర్మిష్ఠకు సంతానాన్ని ఇచ్చాడని అంటుంది. ఇద్దరూ కలిసి రహస్యంగా కలుసుకుంటూ తనని మోసం చేశారని చెబుతుంది. తనకి భయపడుతూ తన దగ్గర దాసీగా చేసే శర్మిష్ఠ .. ఇప్పుడు తన సవతి స్థానంలో ఉందని చెబుతుంది. తనకి మనశ్శాంతి లేకుండా చేయడంలో ఆమె మరోసారి విజయాన్ని సాధించిందని అంటుంది.
శర్మిష్ఠ ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో చాలా మార్పు వచ్చిందనీ, మునుపటి భయం ఆమెలో కనిపించలేదని దేవయాని చెబుతుంది. అలాగే తన భర్త యయాతికి సేవలు చేసే విషయంలో కూడా ఆమె భయం తగ్గుతూ రావడం తాను గమనిస్తూ వచ్చానని అంటుంది. అంతే కాకుండా తనకి జరగవలసిన సేవల విషయంలో ఎంతటి ఆలస్యమైనా యయాతి ఆమెను ఏమీ అనకపోవడం తన అనుమానానికి మరింత కారణమైందని చెబుతుంది. అప్పటి నుంచే వాళ్లిద్దరి వ్యవహారంపై తాను ఓ కన్నువేస్తూ వచ్చానని అంటుంది.
దేవయాని ఆవేదనను అర్థం చేసుకున్న శుక్రాచార్యుడు వెంటనే యయాతిని కలుసుకుంటాడు. శుక్రాచార్యుడు రాగానే యయాతికి విషయం అర్థమైపోతుంది. తాను తప్పే చేశాననీ .. పెద్ద మనసుతో తనని మన్నించమని యయాతి కోరతాడు. అయితే ఏ రోజున కూడా ఒక భర్తగా దేవయానికి ఎలాంటి లోటూ రానీయలేదని చెబుతాడు. ఇప్పటికీ ఆమె పట్ల తనకి గల ప్రేమానురాగాలు ఎంతమాత్రం తగ్గలేదని అంటాడు. తొందరపాటు కారణంగా తప్పు జరిగిపోయిందని తాను ఒప్పుకున్నప్పటికీ దేవయాని అర్థం చేసుకోలేకపోయిందని అంటాడు.
ఆ మాట వినగానే శుక్రాచార్యుడు కోపంతో మండిపడతాడు. దేవయానితో వివాహ సమయంలోనే తాను శర్మిష్ఠ విషయంలో హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేస్తాడు. ఏవైపు నుంచి తప్పు జరిగే అవకాశం ఉందో గ్రహించి తాను చెప్పినప్పటికీ, ఆయన వినిపించుకోకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. యవ్వన గర్వంతోనే ఆయన ఈ పని చేశాడనే విషయాన్ని తేల్చేస్తాడు. ఇకపై ఇలాంటి తప్పుచేయకుండా వృద్ధుడిగా జీవించమని శపిస్తాడు. అంతే .. ఆ క్షణమే యయాతి వృద్ధుడిగా మారిపోతాడు. తన ముసలి రూపాన్ని చూసుకుని కుంగిపోతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.