శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని యయాతి మోసం చేశాడనే కోపంతో, వృద్ధుడిగా మారిపొమ్మని శపిస్తాడు. ఆయన మహా తపోబల సంపన్నుడు కావడంతో ఆయన శాపం కారణంగా క్షణాల్లోనే యయాతి ముసలివాడిగా మారిపోతాడు. యయాతి తన రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు. రూపంలో మన్మథుడిలా ఉంటావని అంతా అనుకుంటూ ఉంటే, ఆ మాటలను విని తాను ఎంతో గర్వించేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన అంతటి అందగాడు లేడని అనుకుంటూ ఉంటే పొంగిపోతూ ఉండేవాడు.
అలాంటి మనోహరమైన రూపం వల్లనే ఎంతోమంది రాజకన్యలు తనని వివాహం చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించారు. అదే పనిగా తనని ఆరాధిస్తున్న రాజకన్యల గురించి కూడా తాను విని ఉన్నాడు. వాళ్లందరి కలల రాకుమారిడిగా ఉన్నందుకు తాను ఎంతగానో మురిసిపోయేవాడు. నిజం చెప్పాలంటే అలాంటి రూపం వల్లనే దేవయాని తనకి భార్య అయింది .. శర్మిష్ఠ తనపై మనసు పారేసుకుంది. దేవయాని అందాన్ని మెచ్చనివారు లేరు. శర్మిష్ఠను వివాహం చేసుకోవాలని ఆరాటపడని రాజులు లేరు. కానీ వాళ్లిద్దరూ తననే కావాలని అనుకున్నారు.
అందమైన ఆ రూపం ఇప్పుడు తానే గుర్తుపట్టనంతగా మారిపోయింది. అలాంటి ముసలి రూపాన్ని చూసుకుని యయాతి చాలా బాధపడతాడు. వయసు పెరుగుతూ ముసలితనం రావడం వలన ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనసు యవ్వనంతో ఉండి, శరీరం మాత్రం ముసలితనంతో ఉంటే అది నరకంతో సమానమవుతుంది. ముసలితనంతో కనిపిస్తున్న పురుషుడి ముచ్చట తీర్చడానికి ఏ స్త్రీ కూడా అంగీకరించదు. ఇంతకుముందు వరకూ తనతో గడపడానికి ఇష్టపడిన దేవయాని – శర్మిష్ఠ కూడా తన పట్ల అయిష్టతను వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు.
దేవయాని మనసుకు కష్టం కలిగించడం తప్పేననీ, అందుకు ఇంతటి శిక్షను విధించడం సరికాదని యయాతి తన బాధను శుక్రాచార్యుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతాడు .. లేదంటే వేరే మార్గమేదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడతాడు. తనకి శాపం ఇవ్వడం వలన దాని ఫలితాన్ని దేవయాని కూడా అనుభవించవలసి వస్తుందనే విషయాన్ని గుర్తుచేస్తాడు. ఆ మాట శుక్రాచార్యుడిని ఆలోచనలో పడేస్తుంది. దాంతో ఆయన శాంతించి, యయాతి ముసలి తనాన్ని ఎవరైనా ఇష్టపూర్తిగా తీసుకుని .. వాళ్ల యవ్వనాన్ని ఆయనకి ఇవ్వొచ్చంటూ ఒక వెసులుబాటు కల్పిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.