శుక్రాచార్యుడు ఆ మాట చెప్పగానే యయాతి సంతోషంతో పొంగిపోతాడు. ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలునని అంటాడు. తండ్రి కోపానికి ముందుగా భయపడిన దేవయాని కూడా, ఆ తరువాత యయాతి ముసలి రూపాన్ని దూరం చేసుకునే మార్గం చెప్పడంతో సంతోషపడుతుంది. శర్మిష్ఠ కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది. తన కారణంగా యయాతి జీవితాంతం ముసలి వాడిగానే ఉండిపోతాడని ఆందోళన చెందిన ఆమె, శుక్రాచార్యుడు శాంతించడంతో ఆనందానికి లోనవుతుంది. అయితే ఆ సంతోషం పైకి కనిపించకుండా జాగ్రత్తపడుతుంది.

యయాతి అద్దంలో తన రూపం చూసుకుంటాడు. ముడతలుపడిన శరీరం .. నెరసిన జుట్టు .. ఆరిపోయిన పెదవులు .. జీవనం లేని కళ్లు. ముసలితనం గురించి తాను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ముసలివాళ్లను చూసినప్పుడు కూడా తనకి ముసలితనం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు .. ఆందోళన చెందలేదు. కానీ ముసలితనం ఒక మనిషి రూపాన్ని ఇంతగా మార్చేస్తుందా? అని ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది. అలాంటి ముసలితనం తనకి ఈ విధంగా వస్తుందని తాను ఎప్పుడూ ఉహించలేదు. ముసలితనం మరణం వైపు నడిపిస్తుంది .. కానీ మధ్యలో ముసలితనం మరణం కంటే భయంకరమైనది అనుకుంటాడు.

ముసలితనం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాత పిత్త కఫ రోగాలు చుట్టుముడతాయి .. జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. భార్యాబిడ్డలు మాత్రమే కాదు, సేవకులు సైతం అసహ్యించుకునేలా చేస్తాయి. యవ్వనంలో ఆత్మాభిమానం కాపాడుకోవడం తేలికే. కానీ ముసలితనం అనేక అవమానాలకు కారణమవుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లేకుండగా ఏమీ చేయలేని పరిస్థితికి చేరుస్తుంది. తను యవ్వనంలో ఉండగా తనని చూసి భయపడిన వాళ్లంతా, తనకి ముసలితనం రాగానే బలవంతులవుతారు.

అలాంటి ఈ రూపాన్ని వదిలించుకునే పనిని గురించిన ఆలోచన చేయాలని భావిస్తాడు. తన పెద్ద కుమారుడైన యదువును తన మందిరానికి పిలిపిస్తాడు. శుక్రాచార్యుడి శాపం కారణంగా తనకి లభించిన ముసలితనమును గురించి ఆవేదన వ్యక్తం చేస్తాడు. ముసలితనంతో కూడిన రూపాన్ని తాను భరించలేకుండా ఉన్నానని చెబుతాడు. ఎవరైనా తమ యవ్వనాన్ని తనకి ఇచ్చి .. తన ముసలితనాన్ని గ్రహించవచ్చని అంటాడు. తన ముసలితనం తీసుకుని, అతని యవ్వనాన్ని ఇవ్వమని కోరతాడు. సంసార జీవితంపై తనకి ఇంకా వ్యామోహం పోలేదని చెబుతాడు. ఈ విషయంలో తనకి సహకరించమని అడుగుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతో మంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.