ఇలా ముగ్గురు కొడుకులు కూడా తన ముసలితనాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో, యయాతి డీలాపడిపోతాడు. ఇక మరో కుమారుడైన “పూరువు”ను మాత్రమే అడగాలి. ఆయన కాదంటే ఇక తాను వృద్ధుడిగా ఉండిపోవలసిందే. ఇతరులు తమ యవ్వనాన్ని ఇచ్చే అవకాశం లేదు కనుక, తాను ముసలివాడిగా సుఖభోగాలకు దూరంగా ఉండవలసిందేనని అనుకుంటాడు. అంతవరకూ అనుభవిస్తూ వస్తున్న శృంగార జీవితానికి స్వస్తి పలకవలసిందేనని బాధపడతాడు. అలా ఒక రకమైన ఆందోళనతోనే “పూరువు”కు కబురు చేస్తాడు.
తన మందిరానికి వచ్చిన పూరువుకు యయాతి విషయం చెబుతాడు. యవ్వనంలో ఉండగా తన జీవితం వైభవంగా వెలుగొందిన తీరును తలచుకుంటాడు. ఇంకా సుఖాలు .. భోగాలు .. సంసారపరమైన సంతోషాలు అనుభవించాలని ఉందని అంటాడు. గతంలో తాను అనుభవించిన వాటి వాసనలు తనని వెంటాడుతూనే ఉన్నాయని చెబుతాడు. ఆ వాంఛలకు దూరంగా వెళ్లలేకపోతున్నాని అంటాడు. అందువలన తనకి అతని యవ్వనాన్ని ఇచ్చి .. తన ముసలితనాన్ని తీసుకోమని కోరతాడు. ఆయన కాదంటే ఇక మిగిలిన తన జీవితం చీకటిలోనే గడుస్తుందని ఆవేదన చెందుతాడు.
తండ్రి పరిస్థితిని పూరువు అర్థం చేసుకుంటాడు. యవ్వనంలో ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని స్వేచ్ఛగా గడిపిన ఆయన, హఠాత్తుగా వచ్చిన ముసలితనాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని భావిస్తాడు. మహారాజుగా .. మనోహరమైన రూపం కలిగినవాడిగా ఆయనకి లభిస్తూ వచ్చిన అధికారాలకు .. గౌరవ మర్యాదలకు దూరం కావడం తట్టుకోలేకనే ఆయన అలా కోరుతున్నాడని గ్రహిస్తాడు. ఆయన సరదాల కోసం .. సంతోషాల కోసం తన సుఖాలను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి ముసలి తనాన్ని తాను గ్రహించడానికి అంగీకరిస్తాడు. దాంతో యయాతి సంతోషంతో పొంగిపోతాడు.
పూరువు యవ్వనాన్ని గ్రహించిన యయాతి, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడం మెదలుపెడతాడు. విందులు .. విహారాలు .. విలాసాలు ఎప్పటిలానే మొదలవుతాయి. ఇతర రాజులంతా ఈర్ష్య .. అసూయలతో రగిలిపోయేలా ఆయన అందమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అలా యయాతి చాలాకాలం పాటు మహారాజుగా తన పాలనను సాగిస్తాడు. అనేక భోగాలను ఆనందంగా అనుభవిస్తాడు. ఒక రాజు తన జీవితంలో ఎంతటి సంతోషకరంగా .. విలాసవంతంగా గడపగలడో అంతటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.