Sri Mookambika Temple Kollur

లోక కల్యాణం కోసం కొన్ని సందర్భాలలో శ్రీమహావిష్ణువు అసుర సంహారం చేస్తే, మరికొన్ని సందర్భాలలో పరమశివుడు అసుర సంహారం చేస్తూ వచ్చాడు. ఇక మరికొన్ని సమయాల్లో అసుర సంహారం చేయడానికి సాక్షాత్తు ఆదిపరాశక్తి రంగంలోకి దిగవలసి వచ్చింది. అలా అమ్మవారు “మూకాసురుడు” అనే రాక్షసుడిని సంహరించి, “మూకాంబిక దేవి”గా పూజాభిషేకాలు అందుకునే క్షేత్రంగా మూకాంబిక క్షేత్రం దర్శనమిస్తుంది. కర్ణాటక రాష్ట్రం .. ఉడిపి జిల్లా .. కొల్లూరు గ్రామంలో ఈ క్షేత్రం అలరారుతోంది.

పూర్వం కోల మహర్షి ఈ ప్రదేశంలో పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సదాశివుడు. ఏం వరం కావాలో కోరుకోమని కోరతాడు. లోక కల్యాణం కోసం అమ్మవారితో పాటు ముక్కోటి దేవతలతో కలిసి ఈ క్షేత్రంలో కొలువుదీరమని కోల మహర్షి కోరతాడు. అందుకు సదాశివుడు అనుగ్రహిస్తాడు. ఆ స్వామి అక్కడ లింగరూపంలో ఆవిర్భవిస్తాడు. ఆ శివలింగం పైభాగంలో “స్వర్ణ రేఖ” ఉంటుంది. ఆ స్వర్ణ రేఖకి ఒక వైపున ముక్కోటి దేవతలతో కూడిన త్రిమూర్తులు .. మరోవైపున లక్ష్మీదేవి.. పార్వతీదేవి .. సరస్వతీదేవి కొలువుదీరినట్టుగా శివుడు చెబుతాడు.

కోల మహర్షి తపస్సు ఫలితంగా ఏర్పడిన క్షేత్రం కావడం వలన, “కొల్లూరు” అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. మహర్షులచే పూజాభిషేకాలు అందుకున్న ఇక్కడి శివలింగం కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఆ తరువాత కాలంలో బయటపడిన శివలింగానికి నిత్యపూజలు జరగడం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో ఆ క్షేత్రానికి ఆది శంకరులవారు తన శిష్య బృందంతో కలిసి వచ్చారు. ఇక్కడి శివలింగంలో అమ్మవారు కూడా అంతర్లీనంగా ఉన్నారనే విషయాన్ని ఆయన గ్రహించారు. అమ్మవారి అపారమైన శక్తి తరంగాలు ఆ ప్రాంతంలో వెదజల్లబడుతూ ఉండటాన్ని గమనించారు.

శివలింగంలో అమ్మవారు అంతర్లీనంగా ఉండటం వలన భక్తులు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారని ఆది శంకరులవారు భావించారు. భక్తుల దర్శనార్థం .. వాళ్ల నిలవడం కోసం అమ్మవారి మూర్తిని అక్కడ ఏర్పాటు చేయిస్తారు. అప్పటి నుంచి అమ్మవారు మూర్తి రూపంగా కూడా అక్కడ పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు ఉదయం పూట దుర్గాదేవిగా .. మధ్యాహ్నం పూట లక్ష్మిదేవీగా .. సాయంత్రం వేళలో సరస్వతీదేవిగా పూజలు అందుకుంటూ ఉండటం విశేషం.

ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా కూడా అమ్మవారికి ఇష్టదైవంగా .. కొలవేల్పుగా భావించి ఆరాధించినవారే. అమ్మవారి మహిమలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. భక్తులు ఆ ఉపాలయలను దర్శించుకుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.