Sri Bhagavatam -Hiranyakashipu’s anger against Prahlad
గురుకులంలో ప్రహ్లాదుడు సకల వేదాలను చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఒకసారి చెప్పగానే మరొకసారి చెప్పవలసిన అవసరం లేకుండా చేస్తున్న ప్రహ్లాదుడి జ్ఞాపక శక్తి గురువులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతని సందేహాలకు సమాధానాలు వెతుక్కోలేక సతమతమవుతారు. తమ గురుకులంలో ఇంత త్వరగా వేదాలను నేర్చుకున్నవారు లేరని విస్మయానికి లోనవుతారు. తమ గురుకులానికి ప్రహ్లాదుడి వలన మంచి పేరు వస్తుందని ఆనందిస్తారు. హిరణ్యకశిపుడు తమని అభినందిస్తాడని సంతోషంతో పొంగిపోతుంటారు.
అదే సమయంలో లీలావతి తన కుమారుడిపై బెంగ పెట్టుకుంటుంది. దాంతో హిరణ్యకశిపుడు కబురు చేయడంతో, ప్రహ్లాదుడిని వెంటబెట్టుకుని వాళ్లు రాజమందిరానికి వెళతారు. లీలావతి తన కుమారుడికి ఎదురుగా పరిగెత్తుకుని వెళ్లి ఎత్తుకుని ముద్దాడుతుంది. ప్రహ్లాదుడు ఆనందంతో తండ్రి అక్కున చేరతాడు. ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు ఏం మాట్లాడటానికి ప్రయత్నించినా అతను శ్రీహరితో ముడిపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. తన తనయుడు తరచూ శ్రీహరి నామాన్ని పలకడం హిరణ్యకశిపుడికి అసహనాన్ని కలిగిస్తుంది.
ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు. శ్రీహరి పేరును తన దగ్గర పదే పదే పలుకరాదని చెబుతాడు. అతని నోటి వెంట ఆ పేరు రాకూడదని అంటాడు. విష్ణువు దానవులకు ఎంతో అన్యాయం చేశాడనీ, ఆ విష్ణువు కారణంగానే అతని పినతండ్రి హిరణ్యాక్షుడు మరణించాడని చెబుతాడు. పరమేశ్వరుడిని ఆరాధించడం వలన తనకి సంతోషం కలుగుతుంది గనుక ఆయన నామాన్ని జపించమని అంటాడు. అంతేగాని తన శత్రువు పేరును తన ముందు పలకడం తనకి ఆగ్రహాన్ని కలిగిస్తుందని చెబుతాడు.
శ్రీహరి నామం మకరందం వంటిది .. అందులోని తీయదనం ఆ నామం పలికేవారికి మాత్రమే తెలుస్తుందని ప్రహ్లదుడు అంటాడు. సమస్త లోకాలు ఏ భగవంతుడి చేత నడపబడుతున్నాయో, ఆ దైవాన్ని స్మరించకుండా ఉన్నవాడు జీవించిలేనట్టేనని చెబుతాడు. భగవంతుడి నామవైభవం వలన జన్మ తరిస్తుందనీ, అలాంటి నామానికి దూరంగా ఉండటం తన వలన కాదని తేల్చి చెబుతాడు. ఆ మాటకి హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోతాడు. రాజ్యం అంతటా శ్రీహరి నామాన్ని నిషేధిస్తే, తన కుమారుడే పలుకుతున్నాడంటూ మండిపడతాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.