Vayalpadu – Sri Pattabhirama Swamy Temple

శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు .. సీతాదేవి ఆదర్శానికి ఆనవాలు. అందువల్లనే సీతారామాలయం లేని గ్రామం దాదాపుగా కనిపించదు. అలా సీతారాములు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో “వాయల్పాడు” ఒకటిగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ .. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో విలసిల్లుతోంది. మండల కేంద్రమైన వాయల్పాడులో “పట్టాభిరామాలయం” దర్శనమిస్తుంది. సాధారణంగా రామాలయంలో స్వామివారు సీత .. లక్ష్మణ .. హనుమ సమేతంగా కొలువై కనిపిస్తారు. కొన్ని క్షేత్రాలలోనే వీరితో పాటు భరత .. శత్రుఘ్నులు కూడా ఉంటారు. అలాంటి క్షేత్రాలలో వాయల్పాడు ఒకటి.

ఇక్కడ స్వామివారిని జాంబవంతుడు ప్రతిష్ఠించి పూజించాడని స్థలపురాణం చెబుతోంది. ఆ తరువాత మరుగున పడిపోయిన ఈ మూర్తులు, పుట్టలో నుంచి బయటపడ్డాయి. వల్మీకము నుంచి స్వామివారు బయటపడం వలన ఈ క్షేత్రానికి “వాల్మీకి పురం” అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఇక్కడ కొండపై వాల్మీకీ మహర్షి తపస్సు చేసుకున్న కారణంగా ఈ ప్రాంతానికి “వాల్మీకీ పురం” అనే పేరు వచ్చిందనీ, అదే “వాయల్పాడు”గా మారిందనే మరో కథనం వినిపిస్తూ ఉంటుంది.

సాధారణంగా రామాలయాలలో స్వామివారికి ఎడమవైపున అమ్మవారు ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామివారికి కుడివైపున అమ్మవారు ఉండటాన్ని విశేషంగా చెబుతారు. చాలావరకూ రామాలయాలలో శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి .. ఇక్కడ కూడా అంతే. అయితే అమ్మవారి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున కల్యాణోత్సవాన్ని జరుపుతుండటం విశేషం. శ్రీరామనవమి సందర్భంగా జరిగే ప్రత్యేకమైన పూజలు .. సేవలు చూడటానికి రెండు కళ్లూ చాలవు.

గర్భాలయంలో కొలువైన స్వామివారి సౌందర్యాన్ని చూసి తీరవలసిందే. స్వామి కొలువైన గర్భాలయ గోపురాన్ని సుదర్శన విమానం అంటారు. స్వామివారు ఖడ్గాలను కూడా ధరించి ఉండటం వలన, “ప్రతాప రామచంద్రుడు” అని పిలుచుకుంటారు. చోళులు .. విజయనగర ప్రభువుల కాలంలో ఈ క్షేత్రం వెలుగొందుతూ వచ్చిందని అంటారు. ఇక్కడి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని .. వైభవాన్ని గురించి తాళ్లపాక అన్నమయ్య కీర్తించడం విశేషం. అన్నమయ్య అనేక మార్లు ఇక్కడి స్వామిని దర్శించుకున్నాడని తెలిసినప్పుడు మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది.

ఎంతోమంది మహర్షులు .. మహా భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోతాయని అంటారు. సకల శుభాలు చేకూరతాయని చెబుతారు. విశేషమైన పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో .. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతున్న ఈ ఆలయ దర్శనం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం వలన హృదయం భక్తిభావాలకు కేంద్రమవుతుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.