Ainavilli – Sri Siddi Vinayaka Swamy Temple

సకల శుభాలు వినాయకుడి ఆశీస్సులతోనే మొదలవుతాయి. సిద్ధిని కలిగించేవాడు .. బుద్ధిని వికసింపజేసేవాడు ఆయనే. సకల శాస్త్రాలు తెలిసినవారు పూజిస్తే ఆయన ఎంత సంతోషపడతాడో, ఏమీ తెలియని పసి మనసులు నమస్కరించినా ఆయన అంతేలా ఆనందిస్తాడు. చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది వినాయకుడేనని చెప్పాలి. అలాంటి వినాయకుడు అనేక క్షేత్రాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి క్షేత్రాలలో “అయినవిల్లి” ఒకటిగా కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ .. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మండల కేంద్రంగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి వినాయకుడు “కాణిపాకం” వరసిద్ధి వినాయకుడికంటే కూడా ప్రాచీనుడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటన ఆ తరువాత కాణిపాకంలో స్వామి ఆవిర్భవించడానికి కారణమైనదనే ఒక ప్రస్తావన వినిపిస్తుంది. పూర్వం ఈ ప్రదేశంలో “స్వర్ణగణపతి” మహా యజ్ఞాన్ని నిర్వహించగా .. స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి ఆహుతులను స్వీకరించాడని స్థలపురాణం చెబుతోంది. అందువలన ఇప్పటికీ ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తుంటారు.

ఇక్కడ స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రితానికి చెందినవాడు కాదు .. కొన్ని యుగాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి ఇక్కడి స్వామివారిని ఆరాధించాడనీ .. దక్షయజ్ఞ ఆరంభానికి ముందు దక్షుడు ఇక్కడి స్వామిని పూజించాడని చెబుతుంటారు. దీనిని బట్టి ఈ క్షేత్రంలోని స్వామివారి వైభవం ఎప్పటి నుంచి వెలుగొందుతుందో అర్థం చేసుకోవచ్చును. పూర్వం స్వామివారికి దేవతలే ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. ఆ తరువాత తూర్పు చాళుక్యులు ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టినట్టుగా తెలుస్తోంది.

గర్భాలయంలో స్వయంభువు గణపతి దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు. ఆయన ఎదురుగా వాహనమైన మూషికం కాంస్యంతో చేయబడి కనిపిస్తుంది. స్వామివారికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా దర్శనమిస్తాడు. ముందుగా కాలభైరవుడిని దర్శించుకున్న తరువాతనే ప్రధానమైన దైవాన్నీ .. మిగతా ఉపాలయాలను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఉపాలయాలలో విశ్వేశ్వరుడు .. అన్నపూర్ణాదేవి .. శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు.

శివకేశవులు కొలువైన క్షేత్రం కావడం వలన శివ సంబంధమైన .. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో భక్తుల సందడి ఎక్కువగా కనిస్తుంది. వినాయక చవితి .. మహాశివరాత్రి .. విజయదశమి .. కృష్ణాష్టమి వంటి పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు .. సేవలు నిర్వహిస్తుంటారు. కార్తీకమాసంలో ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారికి చెప్పుకున్న కోరికలు ఏ స్థాయిలో నెరవేరతాయో, ఇక్కడ మొక్కుబడులు చెల్లించేవారి సంఖ్యను చూస్తే అర్థమవుతుంది. రాజమండ్రి .. కాకినాడ .. రావులపాలెం ఇలా అనేక మార్గాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అమలాపురం నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం మరింత తేలిక.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.