నరసింహస్వామి ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో “అహోబిలం” ఒకటి. హిరణ్యకశిపుడిని స్వామివారు ఇక్కడే సంహరించాడని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం ఎగువ అహోబిలం .. దిగువ అహోబిలంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నరసింహస్వామి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి .. ఆయన నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది. అసలు అక్కడి వాతావరణమే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది. యుగాలనాటి ఛాతిత్రను మనతో చెప్పడానికి ప్రకృతి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
హిరణ్యకశిపుడిని స్వామివారు సంహరించిన అనంతరం కూడా ఆయన ఉగ్రత్వం తగ్గలేదు. ఆ సమయంలోనే ఆయనను మామూలు స్థితికి తీసుకుని రావడానికి లక్ష్మీదేవి తనవంతు ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. లోక కంటకుడైన హిరణ్య కశిపుడిని అంతం చేసినందుకుగాను, దేవతలు .. మహర్షులు అంతా కూడా అక్క డికి చేరుకొని స్వామివారిని “అహోబల .. అహోబల” అంటూ కీర్తించారట. అలా శాంతించిన స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడి బిలంలో కొలువు కావడంతో ఈ క్షేత్రానికి “అహోబిలం” అనే పేరు వచ్చిందని అంటారు.
ఆంధ్రప్రదేశ్ .. నంద్యాల జిల్లా .. ఆళ్లగడ్డ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. నరసింహ స్వామి క్షేత్రాలలో అత్యంత శక్తిమంతమైనదిగా .. మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వామి వారు అహోబిల నరసింహుడు .. యోగానంద నరసింహుడు .. మాలోల నరసింహుడు .. భార్గవ నరసింహుడు .. జ్వాలా నరసింహుడు .. కారంజ నరసింహుడు .. పవన్ నరసింహుడు .. ఛత్రవట నరసింహుడు .. వరాహ నరసింహుడు అనే తొమ్మిది రూపలలలో కొలువై ఉన్నాడు. అందువల్లనే ఇది నవ నారసింహ క్షేత్రంగా పిలవబడుతోంది.
గర్భాలయంలో స్వామివారు చతుర్భుజుడై ఉంటాడు. ఎడమ తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండగా, శంఖు చక్రాలను ధరించి .. అభయ వరద హస్తాలతో దర్శనమిస్తూ ఉంటాడు. యుగాలనాటి ఈ క్షేత్రంలో మొత్తం 13 తీర్థాలు ఉన్నాయి. ప్రతి తీర్థానికి ఎంతో ప్రత్యేకత .. మరెంతో విశిష్టత కనిపిస్తాయి. ఎంతోమంది మహర్షులు ఈ పుణ్య తీర్థాలలో స్నానమాచరిస్తూ తపస్సును కొనసాగించినట్టుగా స్థలాపురాణం చెబుతోంది. ఎటు చూసినా ఎత్తైన కొండలు .. లోయల మధ్యలో పచ్చని ప్రకృతి ఒడిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గోపురాలు .. విశాలమైన మంటపాలు .. తీర్థ రాజాలతో ఈ క్షేత్రం అలనాటి వైభవానికి అద్దం పడుతుంటుంది.
త్రేతా యుగంలో శ్రీరాముడు .. ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. రెడ్డి రాజులు .. కొండవీటి రాజులు .. విజయనగర రాజుల కాలంలో ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకున్నట్టుగా చరిత్ర చాటుతోంది. వివిధ పురాణాలలోను .. పలు ఆధ్యాత్మిక గ్రంథాలలోను ఈ క్షేత్ర ప్రాశస్త్యం చెప్పబడింది. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు .. సేవలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే సమస్త భయాలు .. పీడలు .. దోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.