ఒక వైపున కన్నవాళ్లను .. మరో వైపున కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన అజామీళుడు, తన కొడుకును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తాడు. వయసుతో పాటు కొడుకు పట్ల వ్యామోహం పెరుగుతూ వస్తుంది. అలా కొడుకే జీవితంగా రోజులు గడుపుతూ వచ్చిన అజామీళుడికి వయసుపైబడుతుంది .. మృత్యువు ఆసన్నమవుతుంది. తాను లేకపోతే తన కొడుకు పరిస్థితి ఏమిటి? అతణ్ణి విడిచి తాను వెళ్లవలసిందేనా? అనే బెంగ మానసికంగా ఆయనను మరింత కుంగదీస్తూ ఉంటుంది. తన జీవితం ముగింపుదశకి చేరుకుందనే విషయం ఆయనకి అర్థమవుతుంది.

అజామీళుడిలో మృత్యుభయం ప్రవేశిస్తుంది .. తన పక్కనే కూర్చోమని కొడుకుని అక్కడే కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు. ఏవేవో భయంకరమైన ఆకారాలు ఆయన కళ్ల ముందు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉండటంతో, ఆయన ఆ వైపే భయం .. భయంగా చూస్తూ ఉంటాడు. హఠాత్తుగా పాము బుసలుకొడుతూ మీదకి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండటంతో ఆయన ఉలిక్కిపడుతూ ఉంటాడు. కళ్లు పెద్దవి చేసి మంచం చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. యమభటులు రావడం ఆయన చూస్తాడు. తన ప్రాణాలను వాళ్లు తీసుకెళ్లిపోతారనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. ఊపిరిపోతున్న సమయంలో ఆయన కొడుకు పట్ల గల ప్రేమతో “నారాయణా .. నారాయణా ..” అని పిలుస్తాడు.

అజామీళుడి నోటి వెంట నుంచి “నారాయణ” అనే మాట రాగానే విష్ణుదూతలు అక్కడికి వచ్చేస్తారు. ఆయన ప్రాణాలను యమభటులు తీయకుండా అడ్డుపడతారు. తమ పనికి విష్ణుదూతలు అడ్డుపడటం చూసి యమదూతలు ఆశ్చర్యపోతారు. అజామీళుడు ఎన్నో పాపకార్యాలు చేశాడనీ, అధర్మ మార్గాలను అనుసరించాడని యమదూతలు అంటారు. కన్నవాళ్లను .. కట్టుకున్న భార్యను అవమానపరచడమే కాకుండా, ఆచారవ్యవహారాలను భ్రష్టు పట్టించిన అతనిని నరకలోకానికి తీసుకువెళ్లడంలో తప్పేం ఉందని అడుగుతారు.

అజామీళుడు గతంలో ఎన్నో పాపాలను చేసి ఉండవచ్చు .. కొన్ని కారణాల వలన ఆయన తన దారితప్పి ఉండవచ్చు. కానీ ఆయన తనని మృత్యువు సమీపించగానే నారాయణా అనే నామాన్ని పలికాడని విష్ణుదూతలు చెబుతారు. నారాయణ అజామీళుడి కొడుకు పేరు అనీ, కొడుకుని పిలిస్తే అది భగవంతుడిని స్మరించినట్లు ఎలా అవుతుందని యమదూతలు ప్రశ్నిస్తారు. నారాయణ అనే నామాన్ని ఎలా పిలిచినా .. ఎక్కడ పిలిచినా .. ఏ కారణంగా అవసాన దశలో పలికినా అది మోక్షాన్నే ప్రసాదిస్తుందని విష్ణుదూతలు అంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.