ఎప్పటిలానే అజామీళుడు అడవికి వెళ్లి దర్భలు కోసుకుని .. పూలు .. పండ్లు సేకరిస్తుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. దాంతో ఆయన అక్కడ ఏం ఉందా అనే ఆలోచనతో అటు వైపు చూస్తాడు. అక్కడి పొదలలో పర పురుషుడితో కామకేళిలో మునిగి ఉన్న స్త్రీ పురుషులను చూస్తాడు. భగవంతుడి పూజకు అవసరమైన పూలు .. దర్భలు తీసుకువెళ్లడానికి వచ్చిన ఆయన, అక్కడ జరుగుతున్న శృంగారాన్ని చూసి వెంటనే వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లలేకపోతాడు. శృంగారంలో ఉన్న ఆ స్త్రీని చూడగానే ఆయన మనసు చెదిరిపోతుంది.

అక్కడి నుంచి ఇంటికి వచ్చిన ఆయనకి మనసు మనసులో ఉండదు. ఆ రోజున పూజ కూడా ఆయన మనస్ఫూర్తిగా చేయలేకపోతాడు. తల్లిదండ్రులను ప్రేమతో పలకరించలేకపోతాడు .. భార్యతో ప్రేమగా మాట్లాడలేకపోతాడు. గృహ అవసరాలకు సంబంధించిన పనులను మొక్కుబడిగా చేస్తూ ఉంటాడు. గతంలో మాదిరిగా ఏదీ ఇష్టంగా తినకపోవడం ..కంటినిండా నిద్రపోకపోవడం చేస్తూ ఉంటాడు. ఎటు చూసినా .. ఏం చేస్తున్నా శృంగారంలో పాల్గొన్న ఆ స్త్రీ రూపమే ఆయన కళ్లముందు కదలాడుతూ ఉంటుంది.

గతంలో మాదిరిగానే అజామీళుడు అడవికి వెళుతుంటాడు .. పూలు – పండ్లు తెచ్చి పూజ చేస్తుంటాడు. కానీ భగవంతుడిపై ఆయన దృష్టి లేదు. తల్లిదండ్రులకు అవసరమైనవి తెచ్చిపెట్టేవాడు .. కానీ ఇదివరకటి ఆప్యాయత లేదు. భార్య పురమాయించిన పనులు చేసేవాడు .. కానీ ఎందుకు అని అడగడం చేసేవాడు కాదు. ఆ పనుల్లో అంత ఉత్సాహం కూడా ఉండేది కాదు. అలా ఆయన ముభావంగా ఉండటాన్ని భార్య గమనిస్తుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది.

అజామీళుడి తల్లిదండ్రులు కూడా తన కుమారుడి ధోరణిలో మార్పురావడాన్ని గమనిస్తారు. విషయమేమిటని అడుగుతారు .. అందుకు సమాధానం చెప్పే ఆసక్తిని కూడా అతను కనబరచకపోవడంతో మౌనం వహిస్తారు. ఏ కారణం చేతనైనా మనసుకు కష్టం కలిగిందేమో అందువల్లనే అలా ఉన్నాడని అనుకుంటారు. కొన్ని రోజులుపోతే అతనే సర్దుకుంటాడని భావిస్తారు. అజామీళుడి కళ్లకి మాత్రం ఆ స్త్రీ రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనసుకు స్థిమితం లేకుండగా చేస్తుంటుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.