విష్ణుదూతలు .. యమదూతల మధ్య జరుగుతున్న సంభాషణ అజామీళుడికి వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరిలో ఎవరు తన ప్రాణాలను తీసుకెళతారోనని ఆయన వాళ్ల సంభాషణపైనే దృష్టి పెడతాడు. యమధర్మరాజు అనుమతి మేరకే తాము అజామీళుడిని తీసుకెళ్లడానికి వచ్చామనీ, ఆయన ఆదేశాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన బాధ్యత తమపై ఉందని యమదూతలు అంటారు. అయితే “నారాయణ” అనే నామాన్ని పలకడం వలన ఆయన నరకలోకానికి రావలసిన అవసరం లేకుండా పోయిందనే వారి వాదనను యమధర్మరాజుకే తెలియజేస్తామని యమదూతలు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

యమదూతలు తన ప్రాణాలు తీయకుండా అక్కడి నుంచి వెళ్లిపోగానే, విష్ణుదూతలకు అజామీళుడు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. నిజంగానే తాను ఎన్నో పాపకార్యాలను చేశానని చెబుతాడు. తరతరాలుగా వస్తున్న వంశ పరువు ప్రతిష్ఠలను భ్రష్టు పట్టించానని అంటాడు. ఎక్కడైతే తన తండ్రి గౌరవ మర్యాదలను అందుకున్నాడో, అక్కడే ఆయన అవమానాల పాలయ్యేలా చేశానని చెబుతాడు. తాను ప్రయోజకుడినయ్యానని ఆనందించిన తన తల్లి, తనకళ్ల ముందే కుంగిపోవడం చూసి కూడా తాను మారలేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఆచార వ్యవహారాలను గురించి తెలుసు .. ఏది దర్మబద్ధమైన మార్గమో తెలుసు. భగవంతుడిని ఎలా సేవించాలో .. ఇల్లాలిని ఎలా ప్రేమించాలో తెలుసు. కానీ వాటన్నింటినీ తాను పక్కకి పెట్టేశానని చెబుతాడు. తనని ప్రేమించడం మాత్రమే తెలిసిన తన భార్య ముఖమైనా చూడకుండానే ఏళ్లు గడిపేసిన తనకి ఆమె ఏమైపోయింది కూడా తెలియదు. ఆమె చివరి క్షణాలు ఎలా గడిచాయో తలచుకుంటే దుఃఖం ఆగడం లేదు. ఇన్ని చేసిన తాను నారాయణ అన్న మాట అన్నందుకే ఇంతటి పుణ్యం ప్రసాదిస్తారా? ఈ ఒక్క విషయం తెలియక తాను ఎంతటి అధోగతి పాలయ్యానని ఆవేదన చెందుతాడు.

యమధర్మరాజు ఏ విషయం తేల్చిన తరువాత తమ పని చూడవచ్చని విష్ణుదూతలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. యమదూతలు యమలోకం వెళ్లి యమధర్మరాజు ముందు నిలుస్తారు. అజామీళుడి విషయంలో తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెబుతారు. అందువల్లనే తాము ఆయన ప్రాణాలను తీసుకురాలేకపోయామని అంటారు. అజామీళుడి విషయంలో విష్ణుదూతలు చెప్పిన మాట నిజమేనని యమధర్మరాజు అంటాడు. మరణ సమయంలో నారాయణ నామాన్ని పలికినవారి విషయంలో ఒక సారి ఆలోచన చేయమని వాళ్లతో చెబుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.