అజామీళుడు మృత్యువు నుంచి బయటపడతాడు. విష్ణుదూతలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నిదానంగా లేచి స్నానాదికాలు పూర్తిచేసుకుంటాడు. పూజామందిరంలో దీపారాధన చేసి భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటాడు. ఆయన కళ్లు వర్షిస్తూ ఉంటాయి. యవ్వనంలో తాను ఎన్నో పొరపాట్లు .. తప్పులు చేశాడు. ఎవరి మాటను లెక్కచేయక తాను అనుకున్నది నిర్భయంగా చేస్తూ వెళ్లాడు. తననే ఆధారంగా భావించిన తల్లిదండ్రులను ఆనందపరచలేకపోయాడు.
తాను సంపాదించినా .. సంపాదించకపోయినా తన కోసం వీధి గుమ్మం దగ్గరే నుంచుని ఎంతో ప్రేమతో ఎదురుచూసిన భార్య, తనలో మార్పు కోసం కూడా అంతే సహనంతో ఎదురుచూసింది. కానీ తాను ఏ విధంగాను ఆమెను సంతోషపరచలేకపోయాడు. పరస్త్రీ వ్యామోహంతో తాను ఎన్నిమార్లు విసుక్కున్నా ఆమెలో తన పట్ల విసుగు కనిపించలేదు. తన మనసు కష్టపడుతుందనే ఉద్దేశంతో తన తల్లిదండ్రులు తనని ఒక్కమాట కూడా అనలేదు. భగవంతుడు ఇంతమంచి బంధాలను ఇచ్చినా వాటిని దాటుకుని వెళ్లడం దౌర్భాగ్యం కాక మరేమిటి?
భగవంతుడు తనకి ఓ దారి చూపించాడు .. ఆ దారిలో నడవమని చెప్పేవాళ్లను ఇచ్చాడు. కానీ తాను ఆ దారిన కాకుండా తప్పుదారిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. తనకి లభించేదే సంతోషం .. తాను పొందినదే ఆనందం అనే మూర్ఖత్వంలో కాలాన్ని వృథా చేసుకున్నాడు. కానీ పూర్వజన్మ పుణ్య విశేషం వలన తాను మరణానికి ముందు “నారాయణ” అనగలిగాడు. అందుకే భగవంతుడు ఎంతటి కరుణామయుడో అర్థమైంది .. ధర్మబద్ధమైన మార్గంలో నడిస్తే ముక్తి లభిస్తుందనే విషయం తెలిసి వచ్చింది.
ఇక సమయాన్ని వృథా చేయకూడదు .. అన్నిరకాల వ్యామోహాలను దాటుకుని వెళ్లాలి .. దైవకార్యాలకే సమయాన్ని ఉపయోగించాలి .. భగవంతుడికి సంబంధించిన మాటలే వినాలి. భగవంతుడి నామ సంకీర్తనంలోనే ఆనందాన్ని పొందాలి అనుకుని అందుకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయ సహకారాలను అందిస్తాడు. తన స్థాయికి తగిన విధంగా దానధర్మాలు చేస్తాడు. ఆ తరువాత భగవంతుడియందే మనసును లగ్నం చేసి శరీరాన్ని వదిలేస్తాడు. ఆయన ఆత్మజ్యోతి భగవంతుడిలో ఐక్యమవుతుంది. అలా అజామీళుడు ముక్తిని పొందుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.