పూర్వం ఒకానొక రాజ్యంలో అజామీళుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను మంచి అందగాడు .. శాస్త్రం తెలిసినవాడు. భగవంతుడి పట్ల భక్తి ఉన్నవాడు .. తల్లితండ్రుల పట్ల ప్రేమ .. భార్యపట్ల అనురాగం ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి ఆచారవంతులైన తల్లిదండ్రుల కనుసన్నలలో పెరిగినవాడు కావడం వలన, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం ఆయనకు అలవడుతుంది. ఉదయాన్నే భగవంతుడికి పూజాభిషేకాలు పూర్తయిన తరువాతనే ఆయన తన దైనందిన కార్యక్రమాలను మొదలుపెడుతూ ఉంటాడు.
నిరంతరం ఆయన భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆయన ఏ పని చేస్తున్నప్పటికీ లోపల భగవంతుడి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వమనే నావను నడిపించు నావికుడు భగవంతుడేనని ఆయన పూర్తిగా విశ్వసిస్తూ ఉంటాడు. అన్నివేళలయందు తమని కనిపెట్టుకుని ఉండే ఆ స్వామిని అనునిత్యం సేవించడంలోనే తరించవచ్చని ఆయన భావిస్తుంటాడు. ప్రతినిత్యం భగవంతుడికి కావలసిన పూలను .. దర్భలను .. పండ్లను దగ్గరలోని అడవి నుంచి తీసుకు వచ్చి పూజిస్తూ ఉంటాడు. అలా స్వామికి నివేదన జరిగిన తరువాతనే ఆ కుటుంబ సభ్యులంతా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.
అత్యంత నియమ నిష్టలతో వ్యవహరించే అజామీళుడు అంటే ఆ ఊళ్లోని వాళ్లందరికీ ఎంతో గౌరవం. నిరంతరం దైవనామ స్మరణ చేసే ఆయన దరిదాపుల్లోకి రావడానికి కూడా అంతా భయపడుతుంటారు. ఇక ఆయన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి, ఎంతో ప్రేమగా వాళ్లను చూసుకుంటూ ఉంటాడు. ఏ విషయంలోను వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ తానే చక్కబెడుతుంటాడు. ఆ విషయంలో ఆయన భార్య కూడా సహకరిస్తూ ఉంటుంది. తన అత్తామామలను ఆమె తల్లిదండ్రుల వలే చూసుకుంటూ ఉంటుంది.
అజామీళుడి తల్లిదండ్రులు కొడుకును చూసుకుని పొంగిపోతుంటారు. భగవంతుడు తమకి ఆణిముత్యం వంటి కొడుకుని ఇచ్చాడని ఆనందిస్తారు. తమ కుమారుడు ఉత్తముడు కావడం .. ఉన్నతమైన స్థానంలో ఉంటూ అందరిచే గౌరవమర్యాదలు అందుకుంటూ ఉండటం వాళ్లకి ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని కలిగిస్తుంది. తన కుమారుడికి తగిన భార్య లభించడం ఆయన అదృష్టం .. తాము చేసుకున్న పుణ్యమని భావిస్తారు. తమ శేష జీవితం ఇలా గడిచిపోతే చాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.