Thiruvananthapuram – Anantha Padmanabhaswamy Temple
అనంతపద్మనాభస్వామి ఆలయం .. ఈ క్షేత్రాన్ని గురించి విననివారు ఉండరు. ఆ స్వామి మహాత్మ్యం .. ఆయన సంపదలను గురించి మాట్లాడుకోనివారు ఉండరు. కేరళ రాష్ట్రం .. “తిరువనంతపురం”లో(Thiruvananthapuram) ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ క్షేత్రం ఒక ఊరంత ఉంటుందేమో అనిపిస్తుంది. చారిత్రక సంపద .. ఆధ్యాత్మిక వైభవం .. ఇలా ఎలా చూసినా ఈ క్షేత్రం గొప్పగానే కనిపిస్తుంది. ఏదో ఒక మహిమాన్వితమైన శక్తి ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉందనే ఒక అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనే భావన కలుగుతుంది.
అనంతుడు అంటే ఆకారమునందు కంటికి చిక్కనివాడు .. అంతములేనివాడు. పద్మనాభుడు అంటే పద్మమును నాభియందు ధరించినవాడు. అనంతపద్మనాభుడు అంటే .. శ్రీమహావిష్ణువు అని అర్థము. ఇక్కడ స్వామి ఆదిశేషుడిపై దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారిని మూడు ద్వారాల ద్వారా దర్శించు కోవలసి ఉంటుంది. మొదటి ద్వారం ద్వారా జరిగే దర్శనం వలన పరమ శివుడు .. రెండవ ద్వారం ద్వారా జరిగే దర్శనం వలన బ్రహ్మదేవుడు .. మూడవ ద్వారం ద్వారా జరిగే దర్శనం వలన విష్ణుమూర్తి ప్రీతి చెందుతారని అంటారు.
అనంతుడు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం “దివాకరముని” అనే భక్తుడు అనునిత్యం శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఆరాధనలో తరిస్తూ ఉంటాడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. తనతోనే ఉండిపొమ్మని దివాకరముని ఒత్తిడి చేయడంతో స్వామి అంగీకరిస్తాడు. అయితే తనపై కోప్పడనంత వరకూ ఉంటాననీ .. అలా జరిగితే మాత్రం వెళ్లిపోతానని చెబుతాడు. అందుకు అంగీకరించిన దివాకరముని సహనాన్ని స్వామి పరీక్షించడం మొదలుపెడతాడు.
బాలకృష్ణుడు చేసే అల్లరిని తట్టుకోలేకపోయిన దివాకరముని ఒక రోజున విసుక్కుంటాడు. దాంతో దగ్గరలో ఉన్న అడవుల్లోకి బాలకృష్ణుడు వెళ్లిపోతాడు. ఆ పసివాడు వెనక వెళ్లిన దివాకరాముని ఆ స్వామి అనంత పద్మనాభుడిగా మారడం చూస్తాడు. ఆయన అభ్యర్థనమేరకు స్వామి తన పరిమాణాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు ఆయనకి దివాకరముని ఒక ఎండు కొబ్బరి చిప్పలో సముద్రపు నీరు తీసుకుని వచ్చి .. దానిలో మామిడి పిందెలు నూరి నైవేద్యంగా సమర్పిస్తాడు. ఇప్పటికీ స్వామివారికి అదే పద్ధతిలో నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు.
అయితే చాలా కాలం క్రితం ఆలయం ఒకసారి అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు, స్వామివారి మూర్తిని బాలాలయంలోకి మార్చారు. అప్పుడు ట్రావెన్ కోర్ రాజవంశానికి చెందిన మార్తాండవర్మ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా, 12వేల సాలిగ్రామాలతో మరో మూర్తిని చేయించి గర్భాలయంలో ప్రతిష్ఠించారు. స్వామివారి సంపదలను గురించి తెలుసుకున్న శత్రు రాజులు ఈ రాజ్యంపై దండెత్తడానికి ప్రయత్నించినప్పుడు, ఈ రాజ్యానికి రాజు అనంతపద్మనాభుడేనని ప్రకటించారు. దాంతో శత్రు రాజులెవరూ ఇక ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
అనంతపద్మనాభస్వామి క్షేత్రంలోకి అడుగుపెడుతుంటే .. ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెడుతున్నట్టుగా ఉంటుంది. దేవలోకంలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. ఏదో శక్తి భగవంతుడి వైపు లాక్కుని వెళుతున్న అనుభూతి కలుగుతుంది. అందువల్లనే ఈ క్షేత్రంలో ఎప్పుడు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఫాల్గుణ .. శ్రావణ మాసాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన క్షేత్రాలలో ఇది ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Thiruvananthapuram – Anantha Padmanabhaswamy Temple