ఓ రోజు రాత్రి ఉష నిద్రిస్తూ ఉండగా ఆమె స్వప్నంలో మన్మథుడిని పోలిన ఒక పురుషుడు కనిపిస్తాడు. స్వప్నంలో నుంచి మెలకువ రాగానే ఉష .. తన స్నేహితురాలైన చిత్రరేఖను పిలుస్తుంది. ఆమె బాణాసురుడి మంత్రి కుంభాండకుడి కుమార్తె. ఉష తన మనసులోని మాటను ఆమెతోనే చెప్పుకుంటూ ఉంటుంది. ఇక చిత్రరేఖకి కొన్ని మంత్ర విద్యలు తెలిసి ఉండటం వలన, మిగతా వాళ్లంతా ఆమె దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఉష మాత్రం ఎక్కడికి వెళ్లినా చిత్రరేఖతోనే వెళుతూ .. వస్తూ ఉంటుంది.
అలాంటి చిత్రరేఖతో ఉష తనకి స్వప్నంలో ఒక అందమైన యువకుడు కనిపించినట్టుగా చెబుతుంది. అతని రూపం మనోహరంగా ఉందని అంటుంది. అలాంటి సుందర రూపాన్ని తాను ఇంతవరకు ఎక్కడా చూడలేదని చెబుతుంది. అయితే తన మనసును అంతగా దొంచినవాడు ఎవరో .. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని అంటుంది. తక్షణమే అతనిని చూడాలని మనసు ఆరాటపడుతోందనీ, అయితే అది సాధ్యమయ్యే పని కాదని అనిపించినప్పుడు మనసు భారమవుతోందని చెబుతుంది. ఆ పురుషుడు ఎవరో ఎలా తెలుస్తుందని అడుగుతుంది.
కాబోయే వరుడిని గురించి ఉష పడుతున్న ఆరాటం చూసి చిత్రరేఖ ఆటపట్టిస్తుంది. తన మంత్రశక్తితో కొంతమంది రాకుమారులను చూపిస్తాననీ, కలలో కనిపించినది ఎవరో గుర్తుపట్టమని చిత్రరేఖ అంటుంది. అందుకు ఉష అంగీకరిస్తుంది. చిత్రరేఖ తన మంత్రశక్తితో ఒక చిత్రపటంపై వివిధ దేశాలకి చెందిన రాకుమారుల రూపాలను చూపిస్తూ వెళుతూ ఉంటుంది. వాళ్లలో అనిరుద్ధుడు ఉండటంతో ఉష గుర్తిస్తుంది. తనకి స్వప్నంలో కనిపించి తన మనసును దోచేసింది అతనేనని చెబుతుంది. అయితే కంగారు పడవలసిన పనిలేదనీ, ఆమె అతణ్ణి చూసే ఏర్పాటు తాను చేస్తానని చిత్రరేఖ మాట ఇస్తుంది.
ఉషకి స్వప్నంలో కనిపించింది ఎవరో కాదనీ .. కృష్ణుడి మనవడు అనిరుద్ధుడు అని చిత్రరేఖ చెబుతుంది. ప్రేమించడంలో తప్పులేదనీ, అయితే అసురజాతికి చెందిన ఆమె అనిరుద్ధుడికి మనసివ్వడం వలన అనేక సమస్యలు ఎదురుకావొచ్చని చిత్రరేఖ చెబుతుంది. కనుక ఈ విషయంలో ఆలోచన చేయమని అడుగుతుంది. తన మనసు అనిరుద్ధుడికి ఇచ్చేశాననీ, ఆయనను తప్ప వేరెవరినీ తన భర్తగా ఊహించలేనని ఉష అంటుంది. ఆయనతో తన వివాహం జరిగేలా చేయమని కోరుతుంది. అందుకు చిత్రరేఖ అంగీకరిస్తుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.