లక్ష్మి నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. లోక కల్యాణం కోసం సగభాగం నరుడిగాను .. సగభాగం సింహ రూపంలోను కలిసి అవతరించిన నరసింహుడు. తన అవతార కార్యానికి తగినట్టుగానే అడవులలో .. కొండలపై .. కొండ గుహలలో ఎక్కువగా ఆవిర్భవించాడు. భక్తులు ఆయన ఆనవాళ్లను కనుగొని ఆ స్వామిని సేవిస్తూ .. తరిస్తూ వస్తున్నారు. తనని దర్శించడానికి కొండపైకి రాలేని భక్తుల కోసం తానే కొండదిగివచ్చిన స్వామి “అరవపల్లి” క్షేత్రంలో దర్శనమిస్తాడు.
అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలో కనిపిస్తుంది. ఇక్కడ స్వామి యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పూర్వం యోగముద్రలో ఆవిర్భవించిన స్వామి దేవతలచే .. మహర్షులచే పూజలు అందుకున్నట్టుగా చెబుతారు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అటవీ ప్రాంతం. ఇక్కడ చుట్టూ పర్వతాలను తలపించే కొండలను చూస్తుంటే అలాగే అనిపిలుస్తుంది. ఇక్కడి పెద్ద గుట్టపైనే ముందుగా నరసింహస్వామి ఆవిర్భవించారని చెబుతారు.
ఇక్కడి “జాజిరెడ్డి గూడెం” సమీపంలోని పెద్ద గుట్టపై వెలసిన స్వామి, ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి తన జాడను తెలియజేశాడు. ఆ రోజు నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవడం మొదలు పెట్టారు. అయితే అడవి ప్రాంతంలోని ఆ గుట్టపైకి చేరుకోవడానికి భక్తులు ఎంతో శ్రమపడవలసి వచ్చింది. చాలామంది ఆ స్వామిని దర్శించుకోలేకపోతున్నందుకు బాధపడసాగారు. అది గమనించిన స్వామి కొండదిగివచ్చి అరవపల్లి గ్రామంలో ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది.
నరసింహస్వామి ఒక పెద్ద పుట్టలో ఆవిర్భవించడం .. ఒక శ్వేతనాగు స్వామివారి మూర్తిని రక్షిస్తూ ఉండటం గ్రామస్తులు చూశారు. అప్పటి నుంచి నిత్య పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లోనే కొంతమంది నాస్తికులు స్వామివారు కొండదిగి రావడం ఏమిటి? ఎవరో ఆ ప్రతిమను అక్కడ పెట్టారు అంటూ పరీక్షించే పనికి పూనుకున్నారు. కానీ స్వామివారి మూలం ఎక్కడ ఉందనేది తెలుసుకోలేక పోయారు. ఇక్కడి స్వామివారి మహిమను గురించి తెలుసుకున్న కాకతీయుల పాలనా కాలానికి చెందిన అన్నపరాయల గణపతి స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది.
ఇప్పటికీ స్వామివారితో పాటు గర్భాలయంలో పాము పుట్ట ఉంటుంది. అప్పుడప్పుడు శ్వేతనాగు అర్చకులకు కనిపిస్తూనే ఉంటుందట. దుష్టగ్రహ పీడలు .. దుష్ట శక్తులచే పీడించబడుతున్నవారు ఇక్కడి స్వామివారిని దర్శించుకోగానే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతారు. మాఘ పౌర్ణమి రోజున స్వామివారి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. జాజిరెడ్డి గూడెం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నేత్రోత్సవంగా ఈ వేడుకను జరుపుతారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ధన్యులవుతారు.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.