కృష్ణుడిని అంతమొందించమని తాను పంపిస్తున్న వాళ్లంతా ఆ కృష్ణుడి చేతిలోనే హతమవుతుండటం కంసుడిని ఆందోళనకు గురిచేస్తుంది. దాంతో ఆయన తీవ్రంగా ఆలోచన చేయడం మొదలుపెడతాడు. “పూతన” దగ్గర నుంచి తాను పంపించిన వాళ్లంతా మహా బలవంతులు. మాయా రూపంలో ఎలాంటి శత్రువునైనా మట్టుపెట్టగలిగినవారు. వాళ్ల మాయను తెలుసుకోవడం .. వాళ్ల ఆటకట్టించడం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఎంతటి బలవంతులను పంపంచినా ఆ కృష్ణుడు ప్రాణాలు తీసేస్తున్నాడు.. ఏమిటి చేయడం? అని ఆలోచన చేస్తాడు.
ఆ సమయంలోనే ఆయనకి “అరిష్టాసురుడు” గుర్తుకు వస్తాడు. “అరిష్టాసురుడు” మహా బలవంతుడు .. తన మాయోపాయంతో శత్రువులను సంహరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఎద్దు రూపంలో శత్రువును కడతేర్చడం ఆయన ప్రత్యేకత. అందువలన అతణ్ణి పంపించడం వలన ప్రయోజనం ఉండవచ్చని కంసుడు భావిస్తాడు. అనుకున్నదే తడవుగా అతణ్ణి రప్పిస్తాడు. అతను చేయవలసిన కార్యాన్ని గురించి వివరిస్తాడు. తన ప్రాణాలు తీయడం కోసమే ఎదుగుతున్నవాడిని అంతం చేసిన తరువాత కనిపించమని ఆదేశిస్తాడు.
అరిష్టాసురుడు తనకంటే ముందుగా వెళ్లిన రాక్షసులు అనుసరించిన మార్గాలను గురించి పరిశీలన చేస్తాడు. ఏ రూపంలో ఎలా వెళ్లినా అది కృష్ణుడికి తెలిసిపోతోందనే విషయాన్ని గ్రహిస్తాడు. అందువలన నేరుగా రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. కృష్ణుడిని భయపెట్టడం వలన ఆయన శక్తిని నీరుగార్చి, ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చేసి పని ముగించాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తాను ఎలాంటి పరిస్థితుల్లోను వెనకడుగు వేయకూడదని అనుకుంటూ అక్కడి నుంచి బయల్దేరతాడు.
కృష్ణుడు ఎన్నో గండాలను దాటుతూ వస్తుండటం .. తమనందరినీ కాపాడుతూ వస్తుండటం పట్ల బృందావన వాసులంతా ఆనందంతో ఉంటారు. ఇకపై ఎలాంటి ఆపదలు ఎదురైనా .. ప్రమాదాలు సంభవించినా కృష్ణుడు ఉన్నాడనే ధైర్యంతో వాళ్లంతా ఉంటారు. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలు యశోద నందులను కలవరపాటుకు గురిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోనని వాళ్లంతా ఆందోళన చెందుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే “అరిష్టాసురుడు” బృందావనంలోకి అడుగుపెడతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.