అరిష్టాసురుడు బృందావనం పొలిమేరలు దాటేసి లోపలికి వస్తూనే, కృష్ణుడి అంతం చూసిన తరువాతనే తిరిగి పొలిమేర దాటి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని గోపాలకులంతా బలరామకృష్ణులతో కలసి, ఆవులను తోలుకుంటూ అడవికి వెళతారు. ఎప్పటిలానే ఆవుల మందలను విశాలమైన మైదానంలో వదిలేసి, తమ ఆటపాటల్లో మునిగిపోతారు. అక్కడ ఊళ్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. అదే సమయంలో ఎద్దుగా మారిపోయిన అరిష్టాసురుడు ఒక్కసారిగా “రంకె” వేస్తాడు.
అరిష్టాసురుడు ఎద్దు రూపంలో వేసిన “రంకె”కు “బృందావనం”లోని వాళ్లంతా హడలిపోతారు. ఇళ్లలోని వాళ్లంతా బయటికి వచ్చి ఆ “రంకె” వినిపించిన వైపు చూస్తారు. చిన్నపాటి కొండను తలపించే ఆకారంతో ఉన్న ఎద్దు చాలా వేగంగా దూసుకు వస్తుండటం చూసి భయంతో కంపించిపోతారు. ఎవరికివారు ఇళ్లలోకి పరుగున వెళ్లి తలుపులు వేస్తుంటారు. ఆ ఎద్దు పరుగులు తీస్తూ వెళ్లిపోగానే తిరిగి బయటికి వస్తుంటారు. తమకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అలాంటి ఎద్దును చూడలేదని చెప్పుకుంటూ ఉంటారు.
ఇంత పెద్ద ఎద్దు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది .. ఎప్పుడూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించనేలేదు. మేత కోసం వచ్చినట్టుగా కూడా ఎప్పుడూ కనిపించలేదు. అయినా ఆ ఎద్దు తాడు తెంచుకున్నదానిలా కొమ్ములు విసురుతూ వెళుతోంది. దానిని ఆపేదెవరు? అడ్డుకునేదెవరు? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాకుండా ఉండాలని ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటారు. మళ్లీ ఆ ఎద్దు తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. దూరంగా ఆ ఎద్దు రంకెలు వేస్తూ తిరుగుతుండటం వాళ్లకి వినిపిస్తూనే ఉంటుంది.
యశోద నందులు కూడా ఊళ్లో అందరినీ కంగారు పెడుతున్న ఎద్దును గురించి వింటారు. ఒకవేళ అది పిల్లలు ఆవులను తోలుకుని వెళ్లిన వైపుకు వెళితే పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన రాగానే వాళ్లంతా మరింత ఆందోళనకి లోనవుతారు. వాళ్లు అనుకున్నట్టుగానే అరిష్టాసురుడు ఆవుల మందల వైపు దూసుకెళతాడు. దూరం నుంచే విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు, దాని కొమ్ములు పట్టుకుని నిలువరిస్తాడు. దాని పొడవైన కొమ్మును విరిచి, దానితోనే దానిపై దాడి చేస్తాడు. తప్పించుకుని మరల మరల దాడి చేయడానికి ఆ అసురుడు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. కృష్ణుడి ధాటికి తట్టుకోలేకపోయిన అరిష్టాసురుడు నిజ రూపాన్ని ధరించి ప్రాణాలు వదులుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.