అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ .. “ద్వారక” సమీపానికి చేరుకుంటాడు. కృష్ణుడి దర్శనం చేసుకుని వెళదామనే ఉద్దేశంతో ద్వారక నగరంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఆయనకి సుభద్ర వివాహ విషయం తెలుస్తుంది. దుర్యోధనుడితో ఆమె వివాహం జరిపించడానికి బలరాముడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసి ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా సుభద్రను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో, “యతి” వేషంలో ద్వారక నగరంలో ప్రవేశిస్తాడు. యతి వేషంలో వచ్చింది అర్జునుడు అని తెలుసుకున్న కృష్ణుడు, తాను చెప్పేవరకూ అదే వేషాన్ని కొనసాగించమని చెబుతాడు.
యతి అంటే చాలు మొదటి నుంచి కూడా బలరాముడికి భక్తి గౌరవాలు ఎక్కువ. అందువలన ద్వారకకి కొత్తగా ఒక యతి వచ్చాడని తెలియగానే, తన పరివారంతో కలిసి యతి దర్శనం చేసుకుంటాడు. ఆ యతి పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడానికి తన సోదరి సుభద్రను నియమిస్తున్నట్టుగా చెబుతాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా, యతి రూపంలోని అర్జునుడు ఆనందంతో పొంగిపోతాడు. అందుకు అంగీకరిస్తున్నట్టుగా చెబుతాడు. అప్పటి నుంచి తనపై ఆమెకి గల ప్రేమానురాగాలను యతి రూపంలోని అర్జునుడు పసిగడుతూనే ఉంటాడు.
బలరాముడు చెప్పినట్టుగానే సుభద్ర అనునిత్యం తోటలోని వివిధ రకాల పూలను సేకరించి, ఆ పూలను భక్తి శ్రద్ధలతో మాలగా కట్టి యతికి అందజేస్తూ ఉంటుంది. ఆయన ఆమె అందచందాలను ఆరాధిస్తూనే, యతిలా నటిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా అర్జునుడు ఆమెను వెతుక్కుంటూ వస్తాడనీ, ఆయనతోనే ఆమె వివాహం జరుగుతుందని ధైర్యం చెబుతూ ఉంటాడు. దాంతో ఆమె యతిని మరింత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటుంది. తన సన్నిధిలోనే సుభద్ర ఉండటంతో అర్జునుడికి ఆనందంగా రోజులు గడిచిపోతుంటాయి.
ఒక వైపున బలరాముడు .. దుర్యోధనుడితో సుభద్ర పెళ్లి జరిపించడానికి హడావిడి పడిపోతుంటే, అంతవరకూ రానీయమని చెప్పి కృష్ణుడు మౌనంగా ఉంటూ ఉంటాడు. మరో వైపున యతి వేషంలో అర్జునుడు .. సుభద్ర మనసును తెలుసుకునే అవకాశాలను ఇస్తూ ఉంటాడు. బలరాముడి ప్రయత్నాలు ముమ్మరం కావడంతో, సుభద్ర ఆందోళన చెందుతుంది. అర్జునుడు ఎక్కడ ఉన్నాడోననే ఆత్రుతను వ్యక్తం చేస్తుంది. యతి రూపంలో అనునిత్యం ఆమెతో సేవలు అందుకుంటున్నది అర్జునుడేనని కృష్ణుడు చెప్పడంతో, సుభద్ర ఆనందాశ్చర్యాలకు లోనవుతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.