ఉష గర్భవతి అని తెలియగానే ఆమె మందిరానికి బాణాసురుడు ఆగ్రహావేశాలతో చేరుకుంటాడు. తండ్రిని మొదటిసారిగా అంతటి కోపంతో చూసిన ఉష భయపడిపోతుంది. పరపురుషుడిని ఎక్కడ దాచింది చెప్పమని బాణాసురుడు అడుగుతాడు. దాంతో ఆయనకి విషయం తెలిసిపోయిందనే సంగతి ఆమెకి అర్థమవుతుంది. ఆయన మాటలు విన్న అనిరుద్ధుడు, ఆమె మందిరం నుంచి బయటికి వస్తాడు. తాను విన్న మాటలు నిజం కాకూడదని అప్పటివరకూ అనుకున్న బాణాసురుడు, ఆమె మందిరంలో పురుషుడిని చూడగానే ఉగ్రుడైపోతాడు.
తన కూతురు ఉష మందిరంలోకి రహస్యంగా ప్రవేశించి, ఆమెతో చనువుగా మసలుతూ వచ్చిన అతను ఎవరో తెలుసుకోవాలని ఉందని బాణాసురుడు అంటాడు. మహా మహా అసురులను మట్టికరిపించిన శ్రీకృష్ణుడికి తాను మనవడిననీ .. తన పేరు అనిరుద్ధుడు అని చెబుతాడు. శ్రీకృష్ణుడి పేరు వినగానే బాణాసురుడు భగ్గుమంటాడు. ఎవరి పేరైతే తాను వినకూడదని అనుకుంటూ ఉంటానో . ఆ పేరు పలకడం అతను చేసిన మరొక తప్పు అని బాణాసురుడు అంటాడు. అతని తాత కృష్ణుడు తనకు బద్ధశత్రువని చెబుతాడు.
లోకంలో ఎంతోమంది వీర పురుషులు ఉండగా, తన శత్రువైన కృష్ణుడి ఇంటి నుంచి తనకి అల్లుడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తావా? అంటూ ఉషపై మండిపడతాడు. ఉద్యానవనంలో ఆమె ఆటపాటలు చూస్తూ సంతోషించేవాడిననీ, కానీ తన పరువు ప్రతిష్ఠలతో ఆడుకోవడానికి ప్రయత్నించడం ఆమె చేసిన తప్పు అని చెబుతాడు. అతని ద్వారా గర్భవతిగా మారేవరకూ ఈ రహస్యాన్ని దాచడం .. కన్నవాళ్లను మోసం చేయడమేనని అంటాడు. కూతురుని గుడ్డిగా నమ్మినందుకు తనకి తగిన బహుమానమే లభించిందని ఆవేదన చెందుతాడు.
అనిరుద్ధుడిని తాను ఎంతగానో ప్రేమించాననీ, ఆయన లేకుండా తాను జీవించలేనని ఉష అంటుంది. ఈ విషయం వాళ్లకి తెలియపరచాలని అనుకుంటూ ఉండగానే ఇదంతా జరిగిందని చెబుతుంది. అనిరుద్ధుడిని ఏమీ చేయవద్దనీ, తన మందిరానికి రావడంలో ఆయన ప్రమేయమేమీ లేదని అంటుంది. బాణాసురుడు ఆ మాటలు పట్టించుకోకుండా అనిరుద్ధుడిని బంధించి చెరసాలలో వేయమని భటులను ఆదేశిస్తాడు. అతణ్ణి విడిచిపెట్టమని ఉష ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా వినిపించుకోకుండా బాణాసురుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఉష కుప్పకూలిపోతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.