బలిచక్రవర్తి కుమారుడైన “బాణాసురుడు” .. “శోణపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన మహాశివ భక్తుడు .. ప్రతినిత్యం శివపూజ తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. మహాపరాక్రమవంతుడైన బాణాసురుడు, తన రాజ్యంవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో పరమశివుడిని గురించి కఠోరమైన తపస్సును చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సదాశివుడు ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దాంతో పార్వతీదేవితో పాటుగా తన కోట వాకిట కొలువై .. తమ రాజ్యాన్ని రక్షిస్తూ ఉండవలసిందిగా వరం కోరతాడు.
తమని కోట వాకిట ఉండవలసిందిగా కోరిన బాణాసురుడి వైపు శంకరుడు చిత్రంగా చూస్తాడు. బాణాసురుడి ఉద్దేశం ఏదైననూ, భక్తితో మెప్పించిన కారణంగా అందుకు శివుడు అంగీకరిస్తాడు. బాణాసురుడు కోరిన విధంగానే పార్వతీదేవితో కలిసి శోణపురం చేరుకుని, ఆయన కోట ముఖ ద్వారం దగ్గరే కొలువై ఉంటాడు. సాక్షాత్తు లోక రక్షకులైన పార్వతీ పరమేశ్వరులు తన కోట గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఇక తాను ఏ విషయంలోనూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని బాణాసురుడు భావిస్తాడు.
బాణాసురుడు సామాన్యుడు కాదు .. ఏదో బలమైన ఉద్దేశంతోనే ఆయన శివపార్వతులను తన కోట ద్వారం దగ్గర ఉండమని కోరి ఉంటాడు. కానీ పరమశివుడు ఆయనకి ఆ వరం ఇవ్వకుండా ఉండవలసిందని ఇంద్రాదిదేవతలు భావిస్తారు. శివుడి వరబలం కారణంగా బాణాసురుడు మున్ముందు ఎలాంటి విపరీతాలకు పాల్పడతాడోనని వాళ్లంతా ఆందోళన చెందుతూ ఉంటారు. బాణాసురుడి వైపు నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవలసినవాడు కూడా ఆ సదాశివుడేనని తలుస్తారు.
బాణాసురుడు .. అతని భార్య .. కూతురు ఉష .. అంతా కూడా అనునిత్యం శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంటారు. వాళ్ల అంకితభావం శివపార్వతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అనుక్షణం తమ గురించి ఆలోచన చేస్తున్న బాణాసురిడిని కంటికి రెప్పలా కాపాడాలని పార్వతీపరమేశ్వరులు నిర్ణయించుకుంటారు. అనునిత్యం బాణాసురుడు ఆదిదంపతులను దర్శించుకున్న తరువాతనే తన దైనందిన కార్యక్రమాలను మొదలుపెడుతుంటాడు. అలా బాణాసురుడు ఎలాంటి సమస్యలు లేకుండా శోణపురమును పాలిస్తూ ఉంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.