ఎప్పటిలానే బలరామకృష్ణులు మిగతా గోపాలకులతో కలిసి అడవికి వెళతారు. గోవులను అదిలిస్తూ .. వాటిని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ .. అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఏపుగా పచ్చిక పెరిగి ఉండటంతో గోవులను వదిలి ఆటపాటల్లో మునుగుతారు. దూరం నుంచి వాళ్లందరినీ “ప్రలంబాసురుడు” గమనిస్తాడు. అందులో కృష్ణుడు .. బలరాముడు అసాధ్యులనే విషయాన్ని గ్రహిస్తాడు. తాను ఓ గోపాలకుడిగా మారిపోయి, వాళ్లలో ఒకడిగా కలిసిపోవాలని నిర్ణయించుకుంటాడు.
తనకంటే ముందుగా వచ్చిన రాక్షస వీరులంతా ఏ రూపంలో వచ్చినా కృష్ణుడు సంహరించాడు. ఏదో ఒక రూపాన్ని ధరించి కృష్ణుడి దగ్గరికి వెళ్లేలోగా ఆయన అప్రమత్తమవుతున్నాడు. అందువలన ఆయనకి అంతటి అవకాశం ఇవ్వకుండా గోపాలుడి వేషాన్ని ధరించి, పక్కనే ఉంటూ అదను చూసి దెబ్బతీయడమే సరైన పని అని అనుకుంటాడు. ఆ క్షణమే గోపాలుడి వేషాన్ని ధరించి, బలరామకృష్ణులు అంతా ఆటపాటల్లో మునిగి ఉన్న సమయంలో, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ గుంపులోకి జొరబడతాడు.
“ప్రలంబాసురుడు” తమ గుంపులోకి ప్రవేశిచిన విషయాన్ని కృష్ణుడు గమనిస్తాడు. ఆటలో భాగంగా బలరాముడి దగ్గరికి వెళ్లినప్పుడు “ప్రలంబాసురుడు” వచ్చిన విషయాన్ని చెప్పేస్తాడు. ఒక పథకం ప్రకారం ఆ రాక్షసుడి ప్రాణాలను తీయాలని చెబుతాడు. అందుకు బలరాముడు సిద్ధపడతాడు. ఆ వెంటనే కృష్ణుడు అందరినీ పిలిచి పాత ఆటను మార్చేసి కొత్త ఆటను మొదలెడదామని చెబుతాడు. దాంతో గోపాలకులు రెండు జట్లుగా విడిపోతారు. బలరాముడి అవతల జట్టులోకి ప్రలంబాసురుడు వచ్చేలా కృష్ణుడు చూస్తాడు.
ఆటలో ఓడిపోయినవారు .. గెలిచినవారిని భుజాలపైకి ఎక్కించుకుని మోయవలసి ఉంటుంది. అలా గెలిచిన బలరాముడిని ప్రలంబాసురుడు భుజాలపైకి ఎక్కించుకుని, మిగతా గోపాలకులకు దూరంగా తీసుకువెళతాడు. తనని ముందుగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ప్రలంబాసురుడు తీసుకువెళుతున్నాడనే విషయం బలరాముడికి అర్థమైపోతుంది. దాంతో బలరాముడు క్షణక్షణానికి తన బరువును పెంచడం మొదలుపెడతాడు. దాంతో ఆయనను మోయలేకపోయిన ఆ అసురుడు నిజ రూపం పొందుతాడు. అంతే .. ఆ రాక్షసుడి తలపై బలమైన పిడిగుద్దులు గుద్దుతాడు బలరాముడు. దాంతో వాడు మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయి ప్రాణాలను విడుస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.