కంసుడిని సంహరించిన కృష్ణుడు, తన తాత అయిన “ఉగ్రసేనుడు”కి సింహాసనాన్ని అప్పగిస్తాడు. దాంతో ప్రజలంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పటివరకూ కంసుడి చెరలో ఉన్న తన తల్లిదండ్రులను .. సాధు సత్పురుషులను బలరామకృష్ణులు విడుదల చేస్తారు. బలరామకృష్ణులను చూసిన దేవకి – వసుదేవుడు సంతోషంతో పొంగిపోతారు. పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుంటారు. కొంతకాలం వరకూ తమ దగ్గర ఉండమని దేవకీదేవి కోరడంతో బలరామకృష్ణులు కాదనలేకపోతారు. అది చూసి నందుడు బాధపడతాడు.
తన తల్లి దేవకి ముచ్చటను తీర్చి త్వరలో వస్తానని చెప్పిన కృష్ణుడు, నందుడిని బృందావనానికి పంపిస్తాడు. నందుడి వెంట బలరామకృష్ణులు రాకపోవడం చూసి యశోదాదేవి చాలా బాధపడుతుంది. కొంతకాలం తరువాత కృష్ణుడు వస్తాడని నందుడు చెప్పినా ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఇదిలా ఉండగా, బలరామకృష్ణులకు విద్యాబుద్ధులు నేర్పించాలని వసుదేవుడు భావిస్తాడు. అందుకు ముందుగా ఉపనయన మహోత్సవాన్ని జరిపించాలని అనుకుంటారు. వసుదేవుడి అభ్యర్థన మేరకు బలరామకృష్ణులకు “గర్గ మహర్షి” ఉపనయన కార్యక్రమాన్ని జరిపిస్తాడు.
ఆ తరువాత విద్యార్జన కోసం ఆ ఇద్దరినీ “సాందీపని” ఆశ్రమానికి పంపించాలని వసుదేవుడు నిర్ణయించుకుంటాడు. సాందీపని ఆశ్రమంలో వివిధ రకాల శాస్త్రాలను బలరామకృష్ణులు అభ్యసిస్తారు. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో, సాందీపని ఆత్మీయతను పొందుతూ వాళ్లిద్దరూ తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. వాళ్ల విద్యాభ్యాసం పూర్తయిందని సాందీపని చెప్పడంతో వాళ్లు ఆయన పాదాలకు వినయంతో నమస్కరించుకుంటారు. గురు దక్షిణగా ఏం కావాలో కోరుకోమని అడుగుతారు.
బలరామకృష్ణులు ఆ మాట అడగ్గానే సాందీపని ముఖంలో ఒక్కసారిగా విచారం అలుముకుంటుంది. అది గమనించిన బలరామకృష్ణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆయన అలా విచారంలో మునిగిపోవడానికి కారణం ఏమిటని అడుగుతారు. తన జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగిందనీ, దానిని ఎవరూ మార్చలేరని సాందీపని అంటాడు. అందువలన ఏం కావాలని అడిగితే, తాను కోల్పోయిన దానిని అడగాలనిపించిందని చెబుతాడు. కాకపోతే ఎవరూ కూడా దానిని తిరిగి ఇవ్వలేరంటూ ఆవేదనను వ్యక్తం చేస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.