కంసుడు తమకి ఆహ్వానం పలకడంలోని అంతరార్థం గ్రహించిన బలరామకృష్ణులు, “మధుర”కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కృష్ణుడి ఆదేశం మేరకు ఇతర గోపాలకులు కూడా వాళ్లతో బయల్దేరడానికి సిద్ధమవుతారు. యశోద నందుల దగ్గర సెలవు తీసుకుని, మధురకు బయల్దేరతారు. వాళ్లు మధురానగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే, ఆ విషయం కంసుడికి తెలిసిపోతుంది. మధుర వాసులంతా బలరామకృష్ణులను ఆనందాశ్చర్యాలతో చూస్తుంటారు. అంత ముద్దుగా .. ముచ్చటగా ఉన్న యువకులను అంతకుముందు తాము చూడలేదని చెప్పుకుంటూ ఉంటారు.

కంసుడి గురించి తెలిసిన అక్కడి ప్రజలు, బలరామకృష్ణులకు ఆయన ఎటువంటి ఆపదను తలపెట్టునోనని ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటారు. బలరామకృష్ణులపై దాడి చేయడానికి కంసుడు సిద్ధం చేసి ఉంచిన “కువలయా పీడ”మను ఏనుగు ఒక్కసారిగా వాళ్లపైకి దూసుకువస్తుంది. ఆ ఏనుగు దంతాలను పట్టుకుని కృష్ణుడు దానిని నిలువరిస్తాడు. చిన్న కొండమాదిరిగా ఉండే ఆ ఏనుగు బలరామకృష్ణులను అంతం చేయడం ఖాయమని మధురానగర వాసులంతా అనుకుంటారు.

భయంకరంగా ఘీంకరిస్తూ ఆ ఏనుగు కృష్ణుడిని తన కాళ్లక్రింద నలపడానికీ, తొండంతో గిరగిరా తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ఏనుగుకు దొరక్కుండా తప్పించుకుంటూ, దాని కుంభస్థలంపై కృష్ణుడు పిడిగుద్దుల వర్షం కురిపిస్తాడు. మధురవాసులంతా చూస్తుండగానే ఆ ఏనుగు కుప్పకూలిపోతుంది. ఆ దృశ్యం చూసినవాళ్లు నివ్వెరపోతారు. బలరామకృష్ణులు సాధారణ యువకులు కాదనే విషయం వాళ్లకు అర్థమవుతుంది. అలా వాళ్లు కంసుడి బారి నుంచి కూడా కాపాడుకోవాలనే వాళ్లంతా కోరుకుంటారు. అక్కడి నుంచి రాజభవనానికి బలరామకృష్ణులు బయలుదేరుతారు.

మధురలోకి ప్రవేశిచిన బలరామకృష్ణులను ఏనుగు అంతం చేసే ఉంటుందని కంసుడు భావిస్తాడు. ఆ కబురు వినడం కోసం ఆయన ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక భటుడు అక్కడికి వస్తాడు. అతణ్ణి దూరం నుంచి చూడగానే, శుభవార్త వినబోతున్నాననే ఆనందంతో కంసుడు ఎదురుగా వెళతాడు. తమ ఏనుగు కృష్ణుడిని ఏమీ చేయలేకపోయిందనీ, దాని ఘీంకారాలకు ఎంతమాత్రం బెదరని కృష్ణుడు అవలీలగా ప్రాణాలు తీసేశాడని చెబుతాడు. ఆ మాటలు వినగానే కంసుడు కలవరపాటుకు లోనవుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.