భరతుడు .. లేడి గురించిన ఆలోచనతో చనిపోవడం వలన, ఆ లేడి గురించిన విషయవాసనలు వెనక్కి లాగడం వలన ఆయన లేడిగా జన్మిస్తాడు. ముందు జన్మలో కొంతకాలం పాటు శ్రీమహావిష్ణువు ధ్యానం చేయడం వలన, ఆయనకి పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. దాంతో లేడి రూపంలోని భరతుడు ఎంతో బాధపడతాడు. ఎంతో గొప్ప చక్రవర్తిగా తాను కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకున్నాడు. ముక్తిని పొందే ఉద్దేశంతో రాజ్యంతో పాటు భార్యాబిడ్డలను కూడా వదిలేసి వనాలకు వచ్చాడు. కానీ ఒక లేడిపిల్ల వ్యామోహంలో చిక్కి తాను ముక్తిమార్గం నుంచి బయటికి వచ్చేశాడు.
ఈ విషయాన్ని తలచుకుంటూ లేడి రూపంలోని భరతుడు ఆవేదన చెందుతాడు. మోక్షాన్ని సాధించాలంటే మానవ జన్మనే ఎత్తాలి. అందువలన ముందుగా తాను మానవుడిగా జన్మించాలి .. ఆ తరువాత శ్రీహరిని ధ్యానిస్తూ మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి ఆ లేడి మనసులో శ్రీహరిని తలచుకుంటూ ఉండటం మొదలుపెడుతుంది. వనాల్లో తాను ఎక్కడ తిరుగుతున్నా .. ఏం చేస్తున్న హరినామం స్మరిస్తూనే ఉంటుంది. తనకి దొరికిన ఆహారంతో సంతృప్తిని చెందటం .. ఆ తరువాత ఒకచోట కూర్చుని శ్రీహరిని తలుచుకోవడం చేస్తూ ఉంటుంది.
అలా కాలం గడిచిపోతుంది .. ఒక రోజున ఆ లేడి మరణిస్తుంది. లేడి రూపంలో చేసుకున్న భగవంతుడి నామస్మరణ కారణంగా, భరతుడు మళ్లీ మానవుడిగా జన్మిస్తాడు. ఒక బ్రాహ్మణుడి రెండవ భార్య కుమారుడిగా ఆయన జన్మిస్తాడు. పూర్వజన్మ స్మృతి ఉండటం వలన అనుక్షణం ఆయన మనసు శ్రీహరి పాదాలపై లగ్నమై ఉంటుంది. ఆయన ఎప్పుడూ భగవంతుడిని గురించే ఆలోచన చేస్తూ ఉండటం వలన, అది పరధ్యానం అని అంతా అనుకునేవారు. చాలామంది ఆయన మానసికస్థితి సరిగ్గాలేదని అనుకునేవాళ్లు.
భరతుడు యవ్వనంలోకి అడుగుపెడతాడు. అనునిత్యం మనసులో శ్రీమహావిష్ణువు నామ స్మరణ జరుగుతూ ఉండటం వలన, ఆయన ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అయితే అసలు ఈ లోకంలోనే లేనట్టుగా ఆయన నడచుకుంటూ ఉండటం వలన ఒక వెర్రివాడిలానే అంతా భావిస్తుంటారు. సవతి పిల్లలు ఆయనతో నానా చాకిరీ చేయిస్తూ ఉంటారు. తాము తినగా మిగిలినది ఏదైనా ఉంటే పెడుతుంటారు .. లేదంటే లేదు. పెడితే తినేవాడు .. లేదంటే పస్తులుండేవాడు .. అడిగేవాడు మాత్రం కాదు.
సవతి తల్లి సోదరులు సిరిసంపదలను అనుభవిస్తూ ఆనందంగా .. హాయిగా ఉండేవారు. భరతుడిని ఒక మనిషిగానే గుర్తించేవారు కాదు. ఆయనతో సమస్త పనులు చేయించుకుంటూ, ఆ ఫలితాన్ని మాత్రం అనుభవించేవారు. చూసేవాళ్లు అయ్యో అనుకునేవాళ్లే తప్ప మరేమీ చేయలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున వాళ్లు భరతుడిని పంటచేను కాపలా కోసం పంపిస్తారు. వాళ్లు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్లిన ఆయన, ఎవరూ లేని ఆ ప్రశాంతమైన ప్రదేశంలో ధ్యానంలోకి వెళ్లిపోతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.