భరతుడు తన ఆశ్రమంలోనే ఆ లేడిపిల్లను ఉంచేసి .. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి గనుక, ఆ లేడిపిల్ల విషయంలో ఆయన ఎన్నోరకాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆశ్రమంలోకి ఎలాంటి మృగాలు రాకుండా .. లేడిపిల్ల బయటికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటాడు. తాను ధ్యానంలోకి వెళ్లేటప్పుడు ఆ లేడి పిల్ల తనతో పాటే ఉండేలా చూసుకుంటాడు. ఆ లేడిపిల్లకు ఆకలి వేస్తుందేమోననే ఆలోచన రాగానే ధ్యానంలో నుంచి బయటికి వస్తుంటాడు.
లేడిపిల్లకు అవసరమైన ఆహారాన్ని అందించి మళ్లీ ధ్యానంలోకి వెళుతుంటాడు. అది తన పక్కనే ఉందా? .. బయటికి వెళ్లిందా? అనే ఆందోళన మనసులో కలగగానే వెంటనే ధ్యానంలో నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఒకసారి దానిని చూసుకుని మళ్లీ ధ్యానంలోకి వెళుతూ ఉంటాడు. ఇలా ఒక వైపున ధ్యానం .. మరో వైపున లేడిపిల్ల పోషణతో ఆయన ఆశ్రమజీవితం సాగుతూ ఉంటుంది. లేడిపిల్ల ఎదుగుతున్నా కొద్దీ భరతుడికి దానిపై ప్రేమానురాగాలు పెరుగుతూ వెళతాయి. దాంతో ఆయన పూర్తిగా భగవంతుడి నామస్మరణకు .. ధ్యానానికి దూరమవుతాడు.
భరతుడికి ఇప్పుడు లేడిపై తప్ప మరి దేనిపై దృష్టిలేదు. ఆయనకి ఆ లేడి తప్ప మరో ధ్యాసలేదు. తాను భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసం రాజ్యాన్ని వదిలేసిన విషయాన్ని ఆయన మరిచిపోతాడు. ముక్తిని కోరి భార్యాబిడ్డలను వదిలేసి వచ్చిన విషయాన్ని కూడా ఆయన మరిచిపోతాడు. ఆ లేడితోనే .. ఆ లేడి చుట్టూనే ఆయన జీవితం తిరుగుతూ ఉంటుంది. ఆ లేడి చేసే అల్లరి పనులను .. సంతోషంతో అది వేసే గెంతులను చూస్తూ ఆయన పొంగిపోతుంటాడు. ఆ లేడి ఆలనా పాలన చూడటంతోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు.
అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. భరతుడికి భగవంతుడిపై ధ్యాసలేదు .. ఆయనకి సంబంధించిన ధ్యానం లేదు. ఆయన సమయమంతా లేడితోనే గడిచిపోతుంటుంది. వయసు పైబడటంతో ఆయనను మృత్యువు సమీపిస్తుంది. తనకి మరణకాలం ఆసన్నమైందనే విషయం భరతుడికి అర్థమవుతుంది. అయితే తన ప్రాణం పోతుందని కాకుండా ఆయన ఆ లేడిపిల్లను గురించి ఆందోళన చెందుతాడు. అడవిలో క్రూరమృగాల మధ్యలో దానిని వదిలివెళతానేమోనని దిగాలు చెందుతాడు. తను చనిపోతే ఆ లేడిపిల్ల పరిస్థితి ఏమైపోతుందోనని బాధపడుతూనే ప్రాణాలు వదులుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.