శుక్రాచార్యుడి నుంచి కచుడు “మృతసంజీవిని” మంత్రం నేర్చుకుంటాడు. ఇక తాను వచ్చిన పని పూర్తయింది .. అందువలన తిరిగి దేవలోకం వెళ్లిపోవాలని కచుడు నిర్ణయించుకుంటాడు. తాను వెళుతున్నట్టుగా శుక్రాచార్యుడితో చెప్పేసి ఆయన అనుమతిని తీసుకుంటాడు. ఆ తరువాత తాను వెళ్లాలనుకుంటున్న విషయాన్ని దేవయానితో చెబుతాడు. ఆ మాట వినగానే దేవయాని నివ్వెరపోతుంది. ఆయన నుంచి ఆ మాట వస్తుందని తాను అనుకోలేదని చెబుతుంది. ఆయన పట్ల తనకి గల ప్రేమానురాగాలను గురించి ప్రస్తావిస్తుంది.
కచుడిని తొలిచూపులోనే తాను ప్రేమించాననీ, అప్పటి నుంచి ఆయన గురించిన ఆలోచనలతోనే తాను బ్రతుకుతున్నానని అంటుంది. ఆయన ఎడబాటును తాను భరించలేకపోతున్నాననీ, ఆయనని పలుమార్లు బ్రతికించడానికి గల కారణం కూడా అదేనని చెబుతుంది. తనని విడిచి ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదనీ, తమ వివాహం .. ఆ తరువాత జీవితం గురించి ఎన్నో కలలు కన్నానని అంటుంది. ఆ కలలు నిజమయ్యే క్షణాల కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతుంది. అందువలన తమ వివాహానికి సిద్ధంగా ఉండమని చెబుతుంది.
తనని క్షమించవలసిందిగా కచుడు కోరతాడు. తాను వచ్చిన దగ్గర నుంచి ఆమె చూపిన అభిమానం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటాడు. అయితే ఎప్పుడూ కూడా తాను ఆమెను మరో దృష్టితో చూడలేదని చెబుతాడు. గురువు కూతురు సోదరితో సమానమనే ధర్మం చెబుతోందనీ, అందువలన తాను ఆమెను ఓ సోదరిలానే చూశానని అంటాడు . అందువలన తమ మధ్య మరో బంధానికి అవకాశం లేనే లేదని చెబుతాడు. మంచి మనసుతో తనకి వీడ్కోలు పలకమని చెబుతాడు. ఆ మాట వినగానే దేవయాని ఆగ్రహావేశాలకు లోనవుతుంది.
మొదటి నుంచి కూడా తాను అనుకున్నది సాధించి తీరతాననీ, తనకి సొంతం అన్నదానిని దక్కించుకుని తీరతానని దేవయాని అంటుంది. వేరే మాటలతో తనని మభ్యపెట్టడానికి ప్రయత్నించవద్దనీ, తాను చెప్పినట్టుగా తమ వివాహం జరగవలసిందేనని చెబుతుంది. అలా ఎప్పటికీ జగదనీ .. సోదరిగా భావించిన యువతిని మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవడం తన వలన కాదని కచుడు అంటాడు. అందువలన తనని భర్తగా పొందాలనే ఆమె ఆలోచన సరైనది కాదని చెబుతాడు. దాంతో కోపంతో రగిలిపోయిన దేవయాని, ఆయన నేర్చుకున్న “మృతసంజీవిని” మంత్రం ఆయనకు పనిచేయకుండా పోవాలని శపిస్తుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.