యయాతి వేషధారణ చూడగానే ఆయన క్షత్రియుడనీ .. మహారాజు అనే విషయాన్ని దేవయాని గ్రహిస్తుంది. ఆయన మంచి ఆజానుబాహుడు .. అందగాడు అని మనసులోనే అనుకుంటుంది. ఇంతటి అందగాడు తనకి మాత్రమే సొంతం కావాలని అనుకుంటుంది. మన్మథుడినే తలదన్నేలా ఉన్న ఈ మహారాజును వివాహం చేసుకోవడం వలన, ఆ శర్మిష్ఠ కుళ్లుకునేలా చేయాలని అనుకుంటుంది. తన తండ్రి తన వివాహాన్ని తన నిర్ణయానికే వదిలేశాడు గనుక, ఆయన వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తుంది.

దేవయాని ఆలోచనలో పడిన విషయాన్ని గ్రహించిన యయాతి, ఆమె మనసులోని మాటను వినడానికి ఆసక్తిని కనబరుస్తాడు. ఏ స్త్రీ అయినా వయసులో ఉండగా పర పురుషుడి చేయి పట్టుకునేది వివాహ సమయంలోనే. అలా చేయి పట్టుకున్నవాడే తన భర్త అని ఆ స్త్రీ భావిస్తుంది. అతనికి తన మనసును .. జీవితాన్ని అర్పిస్తుంది. అతని కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ఒకసారి చేయిపట్టుకున్న పర పురుషుడిని కాదని ఆ స్త్రీ మరొకరికి మనసును అందించలేదు. అందువలన తన చేయి పట్టుకున్న పురుషుడు జీవితాంతం ఆ చేయి వదలకూడదనే ఆ స్త్రీ కోరుకుంటుంది అని దేవయాని అంటుంది.

ఆమె మాటల్లోని ఆంతర్యం కొంతవరకూ యయాతికి అర్థమవుతుంది. అయినా ఆయన ఆ సంభాషణను కొనసాగించకుండా, ఆమె వెళ్లవలసిన చోటుకు చేర్చి తాను వెళతానని అంటాడు. అయితే తాను వివాహితగానే అక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటున్నట్టుగా దేవయాని చెబుతుంది. ఆయనను వివాహం చేసుకోవడం వల్లనే తన జీవితానికి ఒక అర్థం దొరికిన్నట్టుగా భావిస్తానని అంటుంది. తన కోరికను కాదని వద్దనీ .. తన మానప్రాణాలు రక్షించిన అతనే తన భర్త అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.

దేవయాని మాటలు విన్న యయాతి, ఆమె వంటి సౌందర్యవతి కోరి పెళ్లాడతానని అంటే కాదనేవారు ఎవరూ ఉండరని యయాతి అంటాడు. అయితే శుక్రాచార్యుడి గురించి తనకి తెలుసుననీ, ఆయన ఆచారవ్యవహారాలను .. ఆగ్రహావేశాలను తాను ఎరుగుదునని చెబుతాడు. తాను క్షత్రియుడు .. ఆమె బ్రాహ్మణ కన్య .. అది ఒక్కటి మాత్రమే అభ్యంతరంగా అనిపిస్తోందని యయాతి అంటాడు. అయితే బ్రాహ్మణ కన్యనైన తనకి బ్రాహ్మణుడితో వివాహం జరగదనే శాపం ఉందనీ, బృహస్పతి తనయుడైన “కచుడు” ఆ శాపం విధించాడంటూ ఆ విశేషాలను చెప్పడం మొదలు పెడుతుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.