వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురు శర్మిష్ఠ .. ఆమె మహా సౌందర్యవతి. ఎంతోమంది రాజులు .. ఆమె అందచందాలను గురించి తెలుసుకుని ఆమెను వివాహమాడాలనే ఆరాటంతో ఉంటారు. శర్మిష్ఠను వివాహం చేసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆమె తండ్రికి రాయబారం పంపుతుంటారు. ఆమెకి స్వయంవరం ఏర్పాటు చేయాలనీ, ఆమె మనసుకి తగిన వరుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని వృషపర్వుడు భావిస్తాడు. తన మనసుకు తగిన వరుడిని తానే ఎంచుకుంటాననీ, అలాంటివాడు తారసపడినప్పుడు తానే చెబుతానని శర్మిష్ఠ అంటుంది.
వృషపర్వుడి ఆస్థానంలోనే రాజపురోహితుడిగా శుక్రాచార్యుడు ఉంటాడు . ఆయన కుమార్తె దేవయాని. ఆమె కూడా మహా అందగత్తెనే. ఒకసారి ఆమెను చూస్తే పదే పదే గుర్తుకువచ్చే సౌందర్యం ఆమెది. శర్మిష్ఠ – దేవయాని ఇద్దరూ కూడా మంచి స్నేహితురాళ్లు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతుంటారు. తాము అందగత్తెలమనే అహంభావం ఇద్దరిలోను ఉంటుంది. అంతేకాకుండా తాను రాజు కూతురినని శర్మిష్ఠ .. రాక్షసరాజుకే గురువైన శుక్రాచార్యుడి కూతురినని దేవయాని గర్విస్తూ ఉంటారు. శర్మిష్ఠతో పోల్చుకుంటే దేవయానిలో అహంభావం ఎక్కువ. మొదటి నుంచి కూడా ఆమెలో పట్టుదల పాళ్లు ఎక్కువే.
దేవయాని బ్రాహ్మణ కన్య .. శుక్రాచార్యుడి కూతురు. ఆయన మహా తపోబల సంపన్నుడు .. మహా కోపిష్టి. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడనేది ఎవరికీ తెలియదు. అందువలన ఆయన కూతురు దేవయాని అందచందాలను గురించి విన్న రాజులు, ఆమెని చూడాలని ఉబలాటపడతారుగానీ, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయరు. దేవయాని పట్ల గల ప్రేమానురాగాల వలన శుక్రాచార్యుడు కూడా ఆమె వివాహ నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తాడు. ఈ కారణంగా తాము ఎవరిని వివాహమాడాలనే నిర్ణయాలు శర్మిష్ఠ – దేవయాని చేతిలోనే ఉంటాయి.
అలాంటి వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతుంటారు. ఇద్దరూ కూడా ఇతర చెలికత్తెలను వెంటేసుకుని వన విహారాలు చేస్తూ ఉంటారు .. జలకాలాడుతూ ఉంటారు. ఇద్దరూ కూడా కోరినవాటిని క్షణాల్లో సొంతం చేసుకునే స్థాయిలోనే ఉండటం చేత, తమ స్వభావానికి తగినట్టుగానే నడచుకుంటూ ఉంటారు. అలా ఒకరోజున వాళ్లు వనవిహారానికి వెళతారు. అక్కడ వివిధ రకాల పూలమొక్కలు .. ఫల వృక్షాలను చూస్తూ, చెంగు చెంగున గంతులేస్తూ దూకే లేడి పిల్లలను చూస్తూ తమని తాము మరిచిపోతారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.