వనవిహారానికి వెళ్లిన శర్మిష్ఠ – దేవయాని కూడా ఆ వనాల్లో తిరుగుతూ అలసిపోతారు. అలాంటి సమయంలోనే అక్కడ వాళ్లకు ఒక సుందరమైన సరస్సు కనిపిస్తుంది. దాంతో వాళ్లు అందులో జలకాలాడాలని నిర్ణయించుకుంటారు. తమ చెలికత్తెలలో కలిసి సరస్సులోకి దిగుతారు. అలా వాళ్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జలకాలడుతూ ఉండగా, పార్వతీ పరమేశ్వరులు ఆ వైపుగా వెళుతుంటారు. శివుడిని చూసిన ఆ కన్యలందరూ కూడా సిగ్గుతో ఒక్కసారిగా తమ వస్త్రాలను ధరించడం కోసం ఒడ్డుకు వస్తారు.

అయితే ఆ కంగారులో దేవయాని చీరను శర్మిష్ఠ కట్టేసుకుంటుంది. దాంతో శర్మిష్ఠ చీరను దేవయాని కట్టుకోవలసి వస్తుంది. అందుకు దేవయాని నిరాకరిస్తుంది. తాను శుక్రాచార్యుడి కూతురుననీ, ఒకరు విడిచిన చీరను తాను కట్టనని చెబుతుంది. ఆ మాటకు శర్మిష్ఠ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. తాను రాక్షస రాజు కూతురుననీ, తన తండ్రి దగ్గర ఆమె తండ్రి పనిచేస్తున్నాడనే విషయాన్ని మరిచిపోవద్దని అంటుంది. తన స్థాయిని దృష్టిలో పెట్టుకుని తన చీరను ఆమె కట్టుకోవచ్చునని చెబుతుంది.

అయినా దేవయాని ఆమె మాటను వినిపించుకోదు. ఆమె తండ్రి దగ్గర తన తండ్రి పనిచేయడం లేదనీ, తన తండ్రి సలహాలు .. సూచనల కారణంగానే ఆమె తండ్రి రాజ్య పాలనను కొనసాగిస్తున్నాడని అంటుంది. సలహాలు .. సూచనలు ఇవ్వడం కోసమే ఆమె తండ్రిని తన తండ్రి నియమించుకున్నాడనీ, అంతమాత్రానికి అంతగా మిడిసిపడవలసిన అవసరం లేదని శర్మిష్ఠ అంటుంది. అసలు తన ఆదేశంగా భావించి ఆమె ఆ చీరను కట్టుకోవాలని చెబుతుంది. ఎవరి ఆదేశాలు పాటించవలసిన అవసరం తనకి లేదనీ, తాను అసలు వస్త్రాలు లేకుండా ఉండిపోతానేగానీ ఆమె చీరను మాత్రం కట్టుకోనని అంటుంది.

తన స్థాయిని .. తాను కట్టుకున్న చీరను అంతగా దేవయాని తక్కువ చేసి మాట్లాడటాన్ని శర్మిష్ఠ అవమానంగా భావిస్తుంది. ఈ విషయంలో దేవయాని వాదనకి దిగడం ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. రాజు కూతురిగా ఇంతకాలంగా తనతో సమానంగా దేవయానిని చూసుకుంటూ వస్తుంటే, ఆమె ఇలా ప్రవర్తించడాన్ని క్షమించకూడదని నిర్ణయించుకుంటుంది. తననీ .. తన తండ్రిని అవమానపరిచిన దేవయానిని అక్కడే ఉన్న పాడుబడిన బావిలో తోసేయమని చెలికత్తెలను ఆదేశిస్తుంది. వాళ్లంతా కూడా వంటిపై వస్త్రాలు లేకుండా ఉన్న దేవయానిని బావిలోకి తోసేసి వెళ్లిపోతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.