శ్రీమహావిష్ణువుకి ధృవుడు మహాభక్తుడు. ఐదేళ్ల వయసులోనే ఆయన శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సును చేశాడు. అలా ఆ వయసులో ఆయన అంతటి తపస్సు చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ధృవుడి తండ్రి పేరు “ఉత్తానపాదుడు” .. తల్లి పేరు “సునీతి”. ఉత్తానపాదుడి రెండవ భార్య పేరు “సురుచి”. ఆమె వలన ఉత్తానపాదుడికి కలిగిన సంతానం పేరు “ఉత్తముడు”. ఉత్తానపాదుడు రాజ్యపాలనలో నిమగ్నమై ఉంటాడు .. ఆయన ఇద్దరి పిల్లలు కూడా ఎదుగుతూ ఉంటారు.
సునీతి మనసు నిర్మలమైనది .. నిస్వార్థపూరితమైనది. ఆమె అందరినీ ఎంతో ఆత్మీయంగా చూస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంతో నడచుకుంటూ ఉంటుంది. ప్రశాంతతకు ప్రతీకగా ఆమె కనిపిస్తూ ఉంటుంది. భర్తపట్ల అమితమైన అనురాగం కలిగినదిగా ఉంటుంది. తన కుమారుడైన ధృవుడిని ఎలా చూస్తున్నదో .. తన సవతి కుమారుడైన ఉత్తముడిని కూడా అంతే ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది. అందువలన సహజంగానే అంతఃపురంలో అంతా కూడా సునీతి పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు.
సురుచి మాత్రం ఎప్పుడు చూసినా కోపంతో చిటపటలాడుతూ ఉంటుంది. సునీతి అంటే ఆమెకి ఎంతమాత్రం పడేది కాదు. అంతేకాదు ఆమె కొడుకైన ధృవుడు అన్నాకూడా ఆమెకి చిరాకు. తన దరిదాపుల్లోకి కూడా ఆమె ధృవుడిని రానిచ్చేది కాదు. అంతేకాకుండా తన కుమారుడైన ఉత్తముడికి కూడా వాళ్ల పట్ల ప్రేమానురాగాలు లేకుండా చేస్తుంది. ఎప్పుడూ ద్వేషంతో రగిలిపోతూ సునీతిపై భర్తకి లేనిపోనివి కల్పించి చెబుతూ ఉంటుంది. అంతఃపురములోని పనివాళ్ల దగ్గర కూడా ఆమె సునీతి మంచిదికాదనే విషయాన్ని చెబుతూ ఉండేది.
ఉత్తానపాదుడికి సునీతి .. ధృవుడు అంటే ప్రేమనే. అయితే ఆయన సురుచి గయ్యాళితనానికి భయపడుతూ ఉంటాడు. సురుచి పట్ల ఆయనకి గల ప్రేమాభిమానాలను ఆమె అలుసుగా తీసుకుంటుంది. ఆయన బలహీనతను ఆసరాగా చేసుకుని ఆయనను నియంత్రిస్తూ ఉంటుంది. దాంతో ఆయన సునీతి పట్ల ప్రేమాభిమానాలను చూపడానికి భయపడుతూ ఉంటాడు. ఈ కారణంగానే మొదటి భార్యను .. కొడుకుని దూరంగా ఉంచుతూ ఉంటాడు. సురుచి గురించి తెలిసిన పనివాళ్లు, మనసులోనే సునీతి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ, మౌనంగా తమ పని చేసుకుపోతుంటారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.