Draksharamam Bhimeswara Swamy Temple
పరమేశ్వరుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో “పంచారామాలు”కి ఎంతో ప్రత్యేకత .. విశిష్టత ఉన్నాయి. లోక కళ్యాణం కోసం తారకాసురుడి మెడలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఛేదించినప్పుడు అమృత లింగం ఐదు భాగాలైపోయి ఐదు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ భాగాలు దేవతలచే ప్రతిష్ఠించబడి పంచారామ క్షేత్రాలుగా అలరారుతున్నాయి. పంచారామాలలో ఒకటిగా “ద్రాక్షారామం” వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు దాక్షాయణి సమేత భీమేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. పూర్వం దక్షుడు ఈ ప్రదేశాన్ని కేంద్రంగా చేసుకుని పాలించాడని అంటారు. అప్పట్లో ఈ ప్రదేశాన్ని “దక్ష ఆరామం” అనే వారు. ఆ తరువాత కాలంలో వాడుకలో పిలుచుకోవడానికి వచ్చేసరికి అది “ద్రాక్షారామం” అయింది. పరమశివుడిని అవమానపరచడం కోసం దక్షుడు నిరీశ్వర యాగం చేసింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. స్వామివారికి ఇక్కడ చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా భీమేశ్వరుడి పేరుతో ఆయన పూజలు అందుకుంటున్నాడు.
సుమారు 14 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో .. పొడవైన ప్రాకారాలతో .. రెండు అంతస్థుల ప్రాకార మంటపాలతో .. అనేక ఉపాలయాలతో ఈ ఆలయం అలాంటి వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. ఇక్కడి శివలింగం పెరుగుతూ వచ్చి 14 అడుగులకు చేరుకుంది. రెండో అంతస్తుకు చేరుకుని అభిషేకం చేస్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు కూడా రెండో అంతస్థుకి చేరుకోవలసిందే. మిగతా శివలింగాలకు భిన్నంగా ఈ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారికి అభిషేకాలు నిర్వహించడానికి సప్త రుషులు గోదావరిని ఏడు పాయలుగా ఇక్కడికి తీసుకుని వచ్చారట. దీనినే “సప్త గోదావరి” అంటారు .. ఇది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు.
ఈ ఆలయ ప్రాంగాణంలోనే కాశీ విశ్వేశ్వరుడు .. అన్నపూర్ణాదేవి .. మేథో దక్షిణామూర్తి .. వీరభద్రుడు .. లక్ష్మీ గణపతి .. సుబ్రహ్మణ్యుడు .. ఉపాలయాలలో దర్శనమిస్తూ ఉంటారు. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే ఈ క్షేత్రానికి లక్ష్మీనారాయణ మూర్తి క్షేత్ర పాలకుడిగా కనిపిస్తాడు. ఇక్కడి లక్ష్మీనారాయణ మూర్తిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని అంటారు. శ్రీరామచంద్రుడు ఈ క్షేత్ర దర్శనం చేశాడని తెలిసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఇక్కడి భీమేశ్వరుడి పట్ల తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు.
ఎంతోమంది మహాభక్తులు స్వామి దర్శనంతో పునీతులయ్యారు. శ్రీనాథుడితో సహా ఎంతోమంది కవులు ఇక్కడ స్వామివారి లీలా విశేషాలను గురించి తమ గ్రంథాలలో ప్రస్తావించారు. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. శివ సంబంధమైన పర్వదినాలలోను .. క్షేత్రపాలకుడు లక్ష్మీ నారాయణ మూర్తి కావడం వల్ల వైష్ణవ సంబంధమైన పర్వదినాలలోను ప్రత్యేకమైన సేవలు .. ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.