సుదర్శన చక్రం బారి నుంచి తనని కాపాడతారని బ్రహ్మదేవుడిని .. పరమశివుడిని ఆశ్రయించిన దుర్వాసుడికి నిరాశే ఎదురవుతుంది. దాంతో ఆయన ఇక తనని ఆ శ్రీమహావిష్ణువు రక్షించగలడనే ఉద్దేశంతో వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీమహా విష్ణువు కనిపించగానే తన పరిస్థితిని చెప్పుకుని కాపాడమని కోరతాడు. ఆయన వలన అవమానం పాలైన అంబరీషుడే ఆయనను కాపాడగలడని శ్రీమహావిష్ణువు చెబుతాడు. దాంతో ఇక ఆలస్యం చేయకుండా దుర్వాసుడు అక్కడి నుంచి తిరిగి భూలోకానికి చేరుకుంటాడు.

అంబరీషుడిని చూడగానే తనని కాపాడమని దుర్వాసుడు కోరతాడు. సుదర్శన చక్రం తనని ముల్లోకాలు తిప్పించిందనీ, ఆయన మాత్రమే తనని కాపాడగలడని విష్ణుమూర్తి చెప్పాడని అంటాడు. అహంభావంతో చేసిన పనికి తాను చాలా బాధపడుతున్నానని చెబుతాడు. ఆయన అంతటి విష్ణు భక్తుడనే విషయం తెలియకనే తాను అంతటి సాహసం చేశానని అంటాడు. తన భక్తుల మనసులకు బాధ కలిగిస్తే ఆ చక్రధారి ఒప్పుకోడనే విషయం తనకి తెలుసుననీ, తన అజ్ఞానాన్ని మన్నించి సుదర్శన చక్రాన్ని శాంతిపజేయమని అడుగుతాడు.

దాంతో అంబరీషుడు అందరినీ రక్షించువాడు ఆ శ్రీమన్నారాయణుడే అంటూ సుదర్శన చక్రానికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన దుర్వాసుడిని పెద్ద మనసుతో క్షమించి వదిలేయమని కోరతాడు. తాపసి అయిన దుర్వాసుడి తొందరపాటుతనంగా భావించి, ఆయన ప్రాణాలను కాపాడమని ప్రార్ధిస్తాడు. ఆయన ప్రార్ధన ఆలకించిన శ్రీమహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. అయన అలా కనిపించగానే దుర్వాస మహర్షి ఆ స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. సాధుస్వభావి అయిన అంబరీషుడి పట్ల అపరాధం చేసినందుకు మన్నించమని కోరతాడు.

అంబరీషుడు మహా భక్తుడనీ .. ఆయన పట్ల అపరాధం చేసినట్టు తెలుసుకున్న క్షణంలోనే దుర్వాసుడికి తన అనుగ్రహం లభించిందని శ్రీమహావిష్ణువు చెబుతాడు. ఆవేశంతో ఆయన అంబరీషుడికి పెట్టిన శాపం తాను భరిస్తానని అంటాడు. ఆ శాపం కారణంగా లోక కళ్యాణం కోసం తాను “దశావతారాలు” ధరిస్తానని చెబుతాడు. భక్తాగ్రేసరుడైన అంబరీషుడికి తాను ముక్తిని ప్రసాదిస్తున్నానని అంటాడు. ఏకాదశి వ్రత ఫలితంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దర్శనం లభించినందుకు తన జన్మ ధన్యమైందని అంబరీషుడు స్వామివారి పాదాలకు నమస్కరిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.