దుశ్యంతడు(ఋషభుడు), శకుంతల కుమారుడైన భరతుడు మహావీరుడిగా ఎదుగుతాడు. భరతుడు చంద్రవంశానికి చెందినవాడు మరియు చక్రవర్తి అవుతాడు. విశ్వరూపుడి కుమార్తె అయిన “పంచజని”తో ఆయన వివాహం వైభవంగా జరుగుతుంది. వాళ్లిద్దరూ కూడా ఆదర్శవంతమైన దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తారు. వాళ్లకి ఐదుగురు సంతానం కలుగుతుంది. భరతుడు తన పూర్వీకులు అందించిన వంశ ప్రతిష్ఠను కాపాడుతూ, ఆచారవ్యవహారాలు అనుసరిస్తూ వెళుతుంటాడు. ఆయన పాలనలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. భరతుడి మాదిరిగానే ప్రజలంతా కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు.

భరతుడు తన పాలన పట్ల సంతృప్తిని చెందుతాడు. ఇక అప్పటివరకూ అనుభవించిన భోగభాగ్యాలు చాలని అనుకుంటాడు. తన పిల్లలు యవ్వనంలోకి అడుగుపెట్టడం వలన, వాళ్లకి రాజ్యపాలనను అప్పగిస్తాడు. ఇక తాను ముక్తిని సాధించాలని చెప్పేసి అడవులకు వెళతాడు. సంసార బంధాలను .. వ్యామోహాలను తెంపేసుకుని ఆయన భగవంతుడి నామాన్ని జపిస్తూ తపోవనాలకి వెళతాడు. “గండకీ నదీ” తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోతాడు. అను నిత్యం నదీ స్నానం చేసి .. విష్ణుమూర్తి ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటాడు.

ప్రశాంతమైన ఆ ప్రదేశంలో .. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో ఆయన ధ్యానం సజావుగా సాగుతూ ఉంటుంది. భగవంతుడి ధ్యానంలో తన జీవితం సాఫీగా సాగిపోతున్నందుకు ఆయన సంతోషంగా ఉంటాడు. అలా ఆయన దైనందిన జీవితం గడిచిపోతుంటుంది. అలా ఎప్పటిలానే ఒక రోజున ఆయన నదీ స్నానం చేయడానికి గండకీ నదికి వెళతాడు. ఆయన స్నానం చేస్తూ ఉండగా, ఒక సింహం .. లేడిని తరుముకుంటూ అటుగా వస్తుంది. ఆ లేడీ నిండు గర్భంతో ఉండటం భరతుడు చూస్తాడు.

సింహం బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎగిరి దూకుతూ వెళుతున్న ఆ లేడీ .. ఆ నీటి ప్రవాహంలోనే ఒక పిల్లకు జన్మను ఇస్తుంది. ఆ తరువాత ఆ ప్రవాహంలో తల్లి లేడి కొట్టుకుపోతుంది. పిల్ల లేడి కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా భరతుడు దానిని కాపాడతాడు. ఆ లేడిపిల్లను ఒడ్డుకు తీసుకువస్తాడు. తల్లిలేని ఆ పిల్లను సంరక్షించవలసిన బాధ్యత తనదేనని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తనతో పాటు ఆ లేడి పిల్లను ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. ఆ రోజు నుంచి దాని పోషణ భారాన్ని తాను వహిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతో మంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.