కృష్ణుడి ఆదేశం మేరకు విశ్వకర్మ ద్వారకా నగరమును నిర్మిస్తాడు. ఎత్తైన భవనాలు .. విశాలమైన పురవీధులు .. అందమైన వనాలతో ప్రజలందరికీ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ నగరాన్ని తీర్చిదిద్దుతాడు. శత్రువులు అంత తేలికగా ద్వారక చేరుకోలేని విధంగా పకడ్బందీ వ్యూహాలతో నగర నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. బలరామకృష్ణులు ద్వారక చూసి తమ సంతృప్తిని వ్యక్తం చేస్తారు. విశ్వకర్మను అభినందించి .. సత్కరించి పంపంచివేస్తారు. ఆ తరువాత మధురలోని ప్రజలను ద్వారకకు తరలిస్తారు.
చుట్టూ సముద్రం .. మధ్యలో ద్వారకా నగరం .. మధుర వాసులంతా కూడా అక్కడ ఉండటానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అందమైన ఆ నగరంలో నివాసం ఉండటం తమ అదృష్టంగా భావిస్తారు. శత్రువులు ప్రవేశించ వీలులేనిది కావడం వలన, వాళ్లంతా ఎంతో ధైర్యంగా .. హాయిగా జీవిస్తుంటారు. బలరామకృష్ణులకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని, సుఖమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ద్వారకా నగర ప్రజల అవసరాలు తెలుసుకుంటూనే వాటిని తీరుస్తూ వెళుతుంటాడు కృష్ణుడు. అలా ఆనందంగా .. ఆహ్లాదంగా రోజులు గడిచిపోతుంటాయి.
బలరామకృష్ణుల చేతిలో 17మార్లు ఓడిపోయిన జరాసంధుడు, మళ్లీ వాళ్లపై యుద్ధానికి తగిన బలగాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ఒక వైపున ఆయుధాలను సిద్ధం చేయిస్తూనే, మరో వైపున సైనిక బలగాలను సిద్ధం చేయించుకుంటూ ఉంటాడు. ఇంకోవైపున ఈ సారి బలరామకృష్ణులను ఎలా ఎదిరించాలనే విషయంపై వ్యూహరచన చేస్తుంటాడు. బలరామకృష్ణుల అంతు చూడనిదే ఈ సారి వెనుతిరిగి రాకూడదని నిర్ణయించుకుంటాడు. అలా జరాసంధుడు తనకి సంబంధించిన పనులతో ఉంటాడు.
జరాసంధుడు ఎలాంటి అస్త్ర శస్త్రములతో చావకుండగా వరాన్ని పొందాడు. అంతేకాదు ఆయన చావు తన చేతిలో లేదనే విషయం కూడా కృష్ణుడికి తెలుసు. అందువలన జరాసంధుడిని అంతం చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిసిన కృష్ణుడు, ఆయన గురించిన ఆలోచన చేయక తన పనులను తాను చూసుకుంటూ ఉంటాడు. మధుర ప్రజలంతా ద్వారకలో తన రక్షణలో ఉండటం కూడా ఆయన అలా మనశ్శాంతిగా ఉండటానికి మరో కారణం. అయితే జరాసంధుడితో పాటు తాను మరొకరిని కూడా అంతమొందించవలసిన సమయం ఆసన్నమైనదనే విషయం కృష్ణుడికి అర్థమైపోతుంది. కృష్ణుడి చేతిలో మరణించవలసిన అతనే .. “శిశుపాలుడు”.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.