Sri Bhagavatam – Emergence of Vamanavatar – Requests 3 steps from Balichakravarti

కశ్యప ప్రజాపతి – అదితి దంపతులకు బిడ్డగా వామనుడు జన్మిస్తాడు. సకల శుభలక్షణాలు కలిగిన ఆ బిడ్డను చూసి ఆ దంపతులు ఆనందంతో పొంగిపోతారు. ఉపనయనం చేసే వయసు రాగానే ఆ పిల్లవాడికి వాళ్లు ఉపనయన సంస్కారాలను జరుపుతారు. ఆ తరువాత వామనుడు దండము .. కమండలము .. ఛత్రము .. దర్భలు పట్టుకుని, బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ బాలుడి దివ్యమైన తేజస్సును చూడగానే, బలిచక్రవర్తి సాదరంగా ఆహ్వానిస్తాడు. బలిచక్రవర్తికి బ్రహ్మణుల పట్ల అపారమైన ఆదరాభిమానాలు ఉన్నాయని తెలిసి వచ్చానని వామనుడు చెబుతాడు.

బలిచక్రవర్తి ఆయన రాక పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఏం కావాలని అడుగుతాడు. ఏది కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. మూడు అడుగుల నేల ఇస్తే చాలనీ .. అంతకుమించి తనకి ఏమీ అవసరం లేదని వామనుడు అంటాడు. ఆ మాట అనగానే అక్కడే ఉన్న శుక్రాచార్యుడు .. వామనుడి వైపు అనుమానంగా చూస్తాడు. ఎవరైనా భూములు .. స్వర్ణం .. గోవులు .. గ్రామాలు దానంగా అడుగుతారు. కానీ ఈ బాల బ్రాహ్మణుడు మూడు అడుగుల నేల అడగడం ఏమిటి? అనే సందేహంలో పడతాడు.

ముల్లోకాలను పాలించే బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను అడగడం ఏమిటి? అయినా ఆయన అడిగినంత భూమిని ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని బలిచక్రవర్తి అంటాడు. దాంతో వెంటనే శుక్రాచార్యుడు .. బలిచక్రవర్తిని పక్కకి పిలిచి .. బాలబ్రాహ్మణుడిగా వచ్చినది సాధారణమైన కుర్రవాడు కాదనిపిస్తోందని అంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆ రూపంలో వచ్చినట్టుగా తనకి అనిపిస్తోందని చెబుతాడు. వామనుడు మూడు అడుగుల నేలను అడగడంలో ఏదో మర్మం ఉన్నట్టుగా తనకి అనిపిస్తోందనీ, అందువలన తొందరపడి ఇస్తానని మాత్రం అనొద్దని హెచ్చరిస్తాడు.

వామనుడిగా వచ్చినది నారాయణుడే అయితే అంతకుమించిన ఆనందం ఏవుంటుంది? సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే తనని దానం అడిగితే అప్పుడు ఆయన చేయి క్రిందకి అవుతుంది .. నా చేయి పైన ఉంటుంది. అంతకన్నా అదృష్టం వేరే ఏముంటుంది? వామనుడికి మూడు అడుగుల నేల ఇవ్వడానికి అంగీకరించాను. దాని పర్యవసానం ఎలాంటిదైనా ఇక మాట మాత్రం తప్పను. తాను చేసే ఈ దానం వలన సమస్తం కోల్పోయినా బాధపడను అని బలిచక్రవర్తి చెబుతాడు. ఆ మాటకి శుక్రాచార్యుడు అయోమయంలో పడతాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని (Bhagavatam) కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.