“త్రికూట పర్వతం” ప్రాంతంలోని దట్టమైన అడవిలో అనేక రకాల జంతువులు .. మృగాలు జీవిస్తూ ఉంటాయి. సువిశాలమైన .. మహాదట్టమైన ఆ అడవిలోకి ప్రవేశించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. సింహాలను చూసి ఏనుగులు .. పులులను చూసి తేళ్లు .. భయపడవలసిందేగానీ, మానవ మాత్రుల వలన వాటికి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే అటు వైపుగా వెళ్లే అవకాశం మానవ మాత్రులకు లేదు. అందువలన ఆ జంతువులన్నీ ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. గుంపులు గుంపులుగా కలిసి జీవించేవి.

దట్టమైన ఆ అడవిలో అనేక ఫల వృక్షాలు .. ఏపుగా పెరిగిన పచ్చిక .. అనేక సరస్సులు ఉండేవి. అందువలన ఆకలికి .. దాహానికి ఆ జంతువులు పెద్దగా అన్వేషించవలసిన అవసరం ఉండేది కాదు. తమ వైరి వర్గానికి చెందిన మృగాలు దాడి చేస్తాయేమోననే సందేహం కలిగినప్పుడు మాత్రం, అవి రహస్య ప్రదేశాల్లో తలదాచుకుని ఆ తరువాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టేవి. కలిసి ఉండటంలోని ఆనందాన్ని అవి కలిసికట్టుగానే అనుభవించేవి. అలాంటి జంతువులలో ఏనుగుల గుంపు ప్రత్యేకంగా కనిపించేది. అవి తినడం .. తిరగడం .. విశ్రాంతి తీసుకోవడం కలిసే చేసేవి.

అలా ఒకసారి ఓ ఏనుగుల గుంపు అడవిలో స్వేచ్ఛగా తిరగసాగింది. గజరాజు ముందుగా నడుస్తుండగా, మిగతా ఏనుగులు దానిని అనుసరించడం మొదలుపెట్టాయి. అలా అవి అడవిలో తిరగడం వలన బాగా అలసిపోయాయి. దాంతో వాటికి బాగా దాహమైంది. దూరంగా ఒక సరస్సు కనిపించడంతో వాటి మనసు ఉత్సాహంతో ఉప్పొంగింది. అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుని, ఆ తరువాత ఆ సరస్సులోకి దిగాలని అవన్నీ కూడా అనుకున్నాయి. అనుకోవడమే తడవుగా ఆ సరస్సు దిశగా కదిలాయి. గుంపుగానే ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాయి.

సరస్సు ఒడ్డునే నిలబడి అవి తమ తొండాలతో నీటిని పీల్చుకున్నాయి. అలా తమ దాహాన్ని తీర్చుకున్నాయి. ఆ తరువాత తమ శరీరాన్ని తడుపుకుని ఆరాటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, గజేంద్రుడు ఆ సరస్సులోకి దిగుతాడు. అప్పుటివరకూ తీక్షణమైన ఎండలో తిరగడం వలన, చల్లని నీళ్లు శరీరానికి తగలగానే ఆ ఏనుగుకి హాయిగా అనిపిస్తుంది. దాంతో తొండంతో నీటిని లాగేసి తనపై చల్లుకుంటూ సరస్సులో మరికొంత ముందుకు వెళుతుంది. ఆనందం ఎక్కువ కావడంతో సరస్సులోని నీళ్లను అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.