శ్రీమహా విష్ణువు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడో .. అప్పుడే మొసలి శిరస్సు ఖండించబడుతుంది. దాని తల .. మొండెం వేరై సరస్సులో తేలిపోతాయి. అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటికి వచ్చి గంధర్వుడిగా నిజరూపాన్ని పొందుతుంది. తనకి శాపవిమోచనాన్ని కలిగించిన స్వామికి నమస్కరించుకుని గంధర్వలోకానికి చేరుకుంటుంది. ఇక గాయపడిన కాలితో ఒడ్డుకు వచ్చిన ఏనుగు .. తొండం పైకెత్తి స్వామివారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరిస్తుంది. స్వామి ఆ ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఏనుగులోని దివ్యజ్యోతి స్వామివారిలో ఐక్యమవుతుంది.
అయితే ఒక ఏనుగు తన ఆపదకాలంలో దైవాన్ని స్మరించడం .. ఆ తరువాత మోక్షాన్ని పొందడం వెనుక ఒక కారణం ఉంది. పూర్వజన్మలో “ఇంద్రద్యుమ్నుడు” అనే మహారాజే ఈ ఏనుగు. ఇంద్రద్యుమ్నుడు శ్రీమహావిష్ణువు భక్తుడు. ఎల్లప్పుడూ ఆయన ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. ఇక పరిపాలనా సంబంధమైన విషయాలను చూసుకున్న తరువాత, మిగతా సమయాన్ని ఆశ్రమ వాతావరణంలో స్వామి ధ్యానానికి కేటాయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయనకి ఎవరూ అంతరాయం కలిగించేవారు కాదు.
ఒకసారి ఆయన స్వామి ధ్యానంలో ఉండగా … అక్కడికి అగస్త్య మహర్షి వస్తాడు. ఇంద్రద్యుమ్న మహారాజు కోసం ఆయన కాసేపు నిరీక్షిస్తాడు. అయితే ఆయన అలా ఎంతసేపు కూర్చున్నా ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో నుంచి బయటికి రాడు. అలా మరి కొంతసేపు ఎదురుచూసిన అగస్త్యుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. కావాలనే రాజు అలా చేస్తున్నాడని అగస్త్యుడు భావిస్తాడు. తనని కావాలనే అవమాపరిచాడని ఆగ్రహావేశాలకు లోనవుతాడు. అజ్ఞానంతో తనని అవమాన పరిచిన కారణంగా ఏనుగువై జన్మించమని శపిస్తాడు.
అలా మహాభక్తుడైన ఇంద్రద్యుమ్నుడు .. అగస్యుడి శాపం కారణంగా ఏనుగులా జన్మిస్తాడు. అడవులలో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. చివరికి మొసలి చేతికి చిక్కుతాడు. క్రితం జన్మలో ఆయన విష్ణుమూర్తి భక్తుడు కావడం వలన, ఆపద సమయంలో భగవంతుడిని స్మరించాలనే జ్ఞానం కలిగింది. ఆ కారణంగానే శ్రీమహావిష్ణువును రప్పించగలుగుతాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పుణ్య విశేషం వలన ముక్తిని పొందుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.